సామరస్యంగా వ్యవహరించండి!

Apr 23,2024 07:54 #Karnataka, #karuvu, #supreem court
  • కేంద్ర, రాష్ట్రాలకు మరోసారి సుప్రీం సూచన
  •  కర్ణాటక కరువు పరిష్కారానికి వారం గడువు కావాలన్న కేంద్రం

న్యూఢిల్లీ : ఫెడరల్‌ వ్యవస్థలో తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి కేంద్రానికి, కర్ణాటక రాష్ట్రానికి గుర్తు చేసింది. కర్ణాటక కరువు కాటకాల ఆందోళనలను పరిష్కరించడానికి ఏదో ఒకటి చేస్తామని, అందుకు వారం రోజులు గడువు కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ౖ’సామరస్యంగా పరిష్కరించుకోండి, మనది ఫెడరల్‌ వ్యవస్థ, కేంద్రం, రాష్ట్రం రెండూ సమాన భాగస్వాములే” అని జస్టిస్‌ బి.ఆర్‌.గవారు, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన బెంచ్‌ కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, కర్ణాటక తరపున వాదనలు వినిపిస్తున్న కపిల్‌ సిబల్‌లనుద్దేశించి వ్యాఖ్యానించింది. వారం రోజులు వేచి చూసేందుకు రాష్ట్రం కూడా సిద్ధంగానే వుందని కపిల్‌ సిబల్‌ తెలిపారు. ఏప్రిల్‌ 8న గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు, పదే పదే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు రావడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ధోరణిని ప్రశ్నించింది. ఇటీవలే, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కేంద్ర వైఖరిని విమర్శిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విపత్తు సహాయక నిధులను విడుదల చేయకుండా తమిళనాడు ప్రజల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని తమిళనాడు ప్రభుత్వం విమర్శించింది. కేరళ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ , రాష్ట్రం రుణ పరిమితిని పెంచకుండా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోందని విమర్శించింది.
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున కర్ణాటక కు సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవ డానికి ముందుగా ఎన్నికల కమిషన్‌ను కేంద్రం సంప్రదించాల్సి వుందని వెంకటరమణి తెలిపారు.

తీవ్ర మానవతా సంక్షోభం
తమ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరుతూ చేసిన అభ్యర్ధనకు ఎదురు దెబ్బ తగిలిందని కర్ణాటక తన పిటిషన్‌లో పేర్కొంది. జాతీయ విపత్తు సహాయక నిధి కింద రూ.18,171.44 కోట్లు సాయం ఇవ్వాల్సిందిగా ఆరు మాసాల క్రితం రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. దానికి మౌనమే సమాధానమైంది. మొత్తంగా రాష్ట్రంలో పంటల నష్టం రూ.35,162.05కోట్లుగా వుందని ఆ పిటిషన్‌లో కర్ణాటక పేర్కొంది. రాష్ట్రం తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని న్యాయవాది డిఎల్‌ చందన పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద కరువు సాయం అందించాల్సిందిగా ఇప్పటికి మూడుసార్లు మెమొరాండాలు అందించామని తెలిపింది.
రాజ్యాంగంలోని 21వ సెక్షన్‌ కింద ప్రజలకు హామీ కల్పించబడిన ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని, కానీ కేంద్రం ఆర్థిక సాయాన్ని నిరాకరించడం వల్ల రాజ్యాంగంలోని 14వ అధికరణ (సమానత్వ హక్కు), 21వ అధికరణ (జీవన హక్కు)ల కింద కర్ణాటక ప్రజల ప్రాధమిక హక్కులు ఉల్లంఘించబడు తున్నాయని ఆ పిటిషన్‌లో రాష్ట్రం పేర్కొంది.

➡️