రెండు దశల ఓటింగ్‌ సరళితో బిజెపిలో భయం భయం

May 1,2024 04:43 #2024 election, #Amit Shah, #BJP, #PM Modi
  • తగ్గిన పోలింగ్‌ శాతం
  •  పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
  • ధరలు, నిరుద్యోగం, కార్పొరేట్ల దోపిడీ ముందు తేలిపోయిన భావోద్వేగ ఫార్మూలా
  •  ప్రతిపక్షాల మధ్య ఐక్యత
  •  గత సీట్లు నిలబెట్టుకోవడం కష్టమే

సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ తేడా కొట్టడంతో మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చిన బిజెపికి రెండో దశలోనూ పెద్దగా వర్కవుట్‌ కాలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లలో కోతపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికే పోలింగ్‌ శాతం తగ్గడం, ప్రత్యేకించి బిజెపికి పట్టున్న రాష్ట్రాల్లో మరింత తగ్గడం కమలనాథులను కలవరపాటుకు గురి చేస్తోంది. 400 సీట్ల సంగతేమో, 2019లో గెలిచిన సీట్లను సైతం నిలబెట్టుకోవడం ఆ పార్టీకి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. గతంలో 63 చోట్ల ఎన్‌డిఎ గెలిచింది. ఓటింగ్‌ సరళిని బట్టి చూస్తే ఈసారి బిజెపికి ఈ స్థానాల్లో భారీగా కోత పడే అవకాశం ఉంది. 370 సీట్లు సొంతంగా సాధిస్తామని చెప్తున్న పార్టీకి మొదటి, రెండో దశలు మింగుడు పడలేదని సమాచారం.

దేశంలో మోడీ చరిష్మా ఉన్నట్టు బిజెపి కొంతకాలంగా కలరింగ్‌ ఇస్తోంది. కాగా వేవ్‌ ఉంటే పోలింగ్‌ పెరుగుతుందన్నది విశ్లేషకుల వాదన. అయితే, 2014, 2019 ఎన్నికల కంటే ఈమారు ఓటింగ్‌ శాతం తగ్గింది. 2019లో ఈ 88 సీట్లలోని 85 సీట్లలో 69.64 శాతం పోలింగ్‌ కాగా, ఈసారి 63.5 శాతం మాత్రమే నమోదైంది. ఓటింగ్‌ శాతం తగ్గడం ఒక అంశమైతే.. బిజెపికి పట్టున్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో మరింత తగ్గడం బిజెపిని ఆందోళనకు గురి చేసే అంశం. రెండో విడతలో యుపిలోని 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 54.85 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. ఇవే స్థానాలకు 2019లో 62 శాతం ఓటింగ్‌ జరిగింది. బిజెపి కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్న మథురలో గత ఎన్నికలకు ఇప్పటికి ఓటింగ్‌ 12 శాతం తగ్గింది. ఘజియాబాద్‌లో 6 శాతం తగ్గింది. గత ఎన్నికల్లో ఎన్‌డిఎ దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన మహారాష్ట్రలో 59.6 (2019లో 63 శాతం), బీహార్‌లో 57 శాతం (2019లో 63 శాతం), రాజస్థాన్‌లో 64.07 శాతం(2019లో 68 శాతం) నమోదైంది. మరోవైపు బిజెపికి పట్టులేని కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో 70 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కావడం బిజెపి వ్యతిరేక పవనాలకు సూచిక అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బిజెపి సీట్ల సంఖ్యకు కోత
రెండో దశ ఎన్నికలు జరిగిన 88 స్థానాల్లో కేరళలోని 20 స్థానాల్లో ఒకటి రెండు స్థానాలు మినహా ఎక్కడా బిజెపి కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఇక, గత ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిచిన ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఈసారి బిజెపికి ఎదురుగాలి వీస్తున్నది.
రైతుల్లో వ్యతిరేకత, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలు బిజెపికి ప్రతికూలంగా మారాయని అంచనా. గత ఎన్నికల్లో ప్రతిపక్షాల విడిపోయి పోటీ చేయడం బిజెపికి కలిసిరాగా, ఈసారి ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతుండటం, ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీల జోష్‌ కనిపిస్తుండటంతో బిజెపి అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు బిజెపికి మద్దతుగా నిలిచిన రాజ్‌పుత్‌లు, జాట్లు, మరాఠాలు ఈసారి దూరమయ్యారనే అంచనాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ బిజెపి విజయావకాశాలకు గండి కొడుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల ఎన్నికలు ముగియడంతో బిజెపి ఆందోళన చెందుతోంది.

సిఎఎ పని చేయలేదు
ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌, అలీపుర్దార్‌, జల్పాయిగుడి, డార్జిలింగ్‌, బలూర్‌ఘాట్‌, రారుగంజ్‌ ఆరు నియోజకవర్గాల్లో ఓటింగ్‌ పూర్తయింది. ఓటింగ్‌ సరళిని బట్టి బెంగాల్‌లో 2019లో లభించిన ఊహించని విజయాన్ని ఈ తడవ నిలబెట్టుకోవడం కష్టమన్న విశ్లేషణలు బిజెపిని మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికి పోలింగ్‌ జరిగిన ఆరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. బిజెపికి పట్టున్న కేంద్రాలన్నింటిలో పోలింగ్‌ భారీగా పడిపోయింది. టిఎంసి దౌర్జన్యాలకు పాల్పడిందని కూచ్‌ బెహార్‌లో గతంలో భారీ మెజారిటీతో గెలుపొందిన కేంద్ర సహాయ మంత్రి నితీష్‌ ప్రమాణిక్‌ ముందస్తు ఓటమిని ఒప్పుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, బాలూర్‌ఘాట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. డార్జిలింగ్‌ మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాలు పెద్ద ఎత్తున వలసలు జరిగిన ప్రాంతాలే. శరణార్థుల మనోభావాలను ఉపయోగించుకోవాలన్న బిజెపి ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు.

కాలం చెల్లిన మతతత్వ ఎజెండా
ఓటింగ్‌ శాతం తగ్గడంపై రాజకీయ విశ్లేషకులు పలు కారణాలు చెప్తున్నారు. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరేలా చేసే భావోద్వేగ అంశాలేవీ ఈ ఎన్నికల్లో పని చేయడం లేదనేది వారి మాట. రామమందిర నిర్మాణం, మతపరమైన అంశాలను తెరపైకి తేవడం ద్వారా లబ్ధి పొందాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలం అవుతున్నట్టు కనిపించడం లేదంటున్నారు. పెరిగిన ధరలు, నిరుద్యోగం, 10 ఏళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత ఓటింగ్‌ తగ్గడానికి కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

జె.జగదీష్‌

➡️