కారుణ్య సాయం మంజూరులో చేతివాటం..!

కదిరి మున్సిపల్‌ కార్యాలయం

          కదిరి టౌన్‌ : పట్టణ ప్రజా రక్షణే ధ్యేయంగా ప్రజలు నిద్రలేవకనే పార, చీపురు చేతబట్టుకుని తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు వెళ్లే నిరుపేద పారిశుధ్య కార్మికులు వారంతా. నిరంతరం కాలుష్యంలో ఉంటూ, వారి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రజాసేవలో నిమగం అయ్యి ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనాలతో జీవనం సాగిస్తుంటారు. నిత్యం దుమ్మూధూళిలో పని చేసే ఈ పారిశుధ్య కార్మికులు ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. కొందరు కార్మికులు ప్రాణాలను సైతం కోల్పోతుంటారు. ఇలా విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం కారుణ్య సాయం కింద ఆర్థిక చేయూతను ఇస్తుంది. ఇలా అందించే సాయంలో కూడా కదిరి మున్సిపల్‌ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కార్మికులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సాయాన్ని అందించడంలో కొందరు అధికారులు వారి వాటాగా కొంత డబ్బులు తీసుకున్న తర్వాతనే ఫైలును ముందుకు కదిపినట్టు సమాచారం. ఒక్కో కార్మికునితో రూ.50వేల వరకు తీసుకున్న తర్వాతనే మిగిలిన మొత్తాన్ని వారికి అందిచినట్లు తెలుస్తోంది. కదిరి మున్సిపాల్టీ పరిధిలోని పారిశుధ్య విభాగంలో పనిచేసే పారిశుధ్య, నీటి సరఫరా కార్మికుల్లో 12 మంది గత మూడు సంవత్సరాల కాలంలో అనారోగ్య సమస్యలతో మరణించారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం కారుణ్య సాయం కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షలు మంజూరు చేసింది. 12 మందిలో మొదటి విడతగా 7మందికి రూ.14 లక్షల సాయం ఈ ఏడాది మార్చి 30వ తేదీన మంజూరు అయ్యింది. ఈ సాయాన్ని సంబంధిత కార్మిక కుటుంబ సభ్యులకు ఇవ్వడంలో మున్సిపాల్టీలోని కొందరు ముఖ్య అధికారులు చేతివాటం ప్రదిర్శించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కార్మికునికి మంజూరైన రూ.2 లక్షల సాయంలో ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు తీసుకుని మిగిలిన సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఇలా ఏడుగురు కార్మికుల నుంచి రూ.3.50 లక్షల తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి మంజూరైన సాయాన్ని తీసుకునేందుకు ఏడుమంది కుటుంబాలు మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగిలేలా తిరిగారు. పలుమార్లు అధికారులను కలిసి వారి కుటుంబ ఇబ్బందులను తెలియజేశారు. అయితే డబ్బులు ఇవ్వందే ఫైలు ముందుకు పంపకూడదని భావించిన మున్సిపాల్టీలోని ఓ విభాగం అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. లేనిపోని నిబంధనలతో కార్మికుల కుటుంబ సభ్యులకు చుక్కలు చూపారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పరిహారం ఇవ్వాలంటే చాలా సమస్యలు ఉన్నాయని, ఆ ఇబ్బందులన్నీ తాము భరించి సాయం ఇవ్వాలంటే తమకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే అంటూ అధికారులు బహిరంగంగానే బేరం మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక్కొక్క కార్మికునికి మంజూరైన సాయం నుంచి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కార్మిక కుటుంబ సభ్యులు వారు డిమాండ్‌ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. అందులో భాగంగా రూ.50వేల ప్రకారం ఏడుగురికి రూ.3.50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ డబ్బులు చెల్లించిన తర్వాత ఏడుగురికి కారుణ్య సాయాన్ని మున్సిపల్‌ అధికారులు అందించారు. ఇంకా ఐదుగురికి ఈ సాయం పంపిణీ చేయాల్సి ఉంది. ఇక కారుణ్య నియామకం కింద మృతుని ఇంట్లో ఒకరికి ఇచ్చే ఉద్యోగం కోసం కూడా పెద్ద ఎత్తునే మున్సిపల్‌ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

సెలవుల వేతనం ఇవ్వడానికీ చేయి తడపాల్సిందే..?!

కదిరి మున్సిపల్‌ పరిధిలోని కొందరు సచివాలయం ఉద్యోగులు ఇటీవల గ్రూపు-1 పరీక్షల సన్నద్ధత కోసం సెలవు పెట్టారు. గ్రూప్‌-1 పరీక్షలు పూర్తి చేసుకుని మళ్లీ వారు విధుల్లో చేరారు. నిబంధనల ప్రకారం వీరికి వర్తించే సెలవులను మినహాయింపుగా తీసుకుని వేతనాలు ఇవ్వాల్సి ఉంది. న్యాయబద్ధంగా వీరికి వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా మున్సిపల్‌ అధికారులు వారితో కూడా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. సెలవుల వేతనంలో తమకూ వాటా ఇవ్వాలంటూ ముందుగానే మాట్లాడుకుని వారి ఫైల్‌ను ముందుకు కదిపారు. పట్టణ పరిధిలోని ఓ సచివాలయ మహిళా ఉద్యోగిని ప్రసూతి సెలవుల విషయంలోనూ రూ.10వేలు తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలా కదిరి మున్సిపాల్టీలో కొందరు అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని సంబంధిత వ్యక్తులు, ఉద్యోగులకు ఇవ్వడంలో భారీగా చేతివాటం ప్రదర్శిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న వాదన బలంంగా విన్పిస్తోంది.

అధికారుల కక్కుర్తి దారుణం

జిఎల్‌.నరసింహులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు.

       తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పారిశుధ్య కార్మికులు ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన అధికారులు వారికి వచ్చిన డబ్బును కూడా కాజేయాలని చూడడం దారుణం. కార్మికులు అనారోగ్యంతో చనిపోతే వారి కుటుంబానికి అందే సాయంలో కోతలు పెట్టడం సరికాదు. కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

➡️