ఓటే వజ్రాయుధం…

May 10,2024 14:55 #vote

వినియోగించకపోతేనే ప్రమాదం
ప్రజాశక్తి- నరసాపురం
ఈనెల 13న జరిగే ఎన్నికలకు ఎక్కడున్నా! పదండి! ఓటేద్దాం! అంటూ ఎన్ని’కల’ ఆహ్వాన పత్రిక సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల మహోత్సవానికి అందరూ తమ వంతు పాల్గని నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ పత్రిక సారాంశం. సోమవారం ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎవరి సొంతూరు దగ్గరలో ఉన్న వారి పోలింగ్‌ బూత్‌ లలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల తలరాతను మార్చే శక్తి ఈ ఓటు అని ,కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల పేర్లతో ఓటర్లకు అభినందనలను ఈ లేఖలో ప్రస్తావించారు. ఓటింగ్‌ పూర్తిస్థాయిలో పడేనా?ఎన్నికలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13న సోమవారం ఎన్నికలు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. తిరిగి 14న ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రయివేట్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంతప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికి బస్సులు, ట్రైన్లు రద్దీగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలలో వరుస సెలవులు నేపథ్యంలో అక్కడి ప్రాంతవాసులు ఓటింగ్‌ దూరంగా ఉండి విహారయాత్రలకు వెళ్లారు. అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రభుత్వాలు సెలవిస్తున్న చదువుకున్న ఉద్యోగులు ఓటింగ్‌ దూరంగా ఉండడం సరికాదని ఐదేళ్లకు వచ్చే ఎన్నికల్లో సరైన నాయకుడు ఎన్నుకునే అవకాశం ఉపయోగించుకోవాలని పలువురు కోరుతున్నారు. ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

➡️