త్వరలో పంచాయతీలకు రూ.2,988 కోట్లు : ఎపికి కేంద్రం హామీ

Dec 23,2023 10:46 #panchayats

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు 2022-23, 2023- 24లో 15వ ఆర్ధిక సంఘం నుంచి రావలసి ఉన్న కేంద్ర నిధులు రూ.2,988 కోట్లు త్వరలో విడుదల చేస్తామనికేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందించారు. జీవన్‌ భారతి భవన్‌ లో కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌ కుమార్‌కు జాస్తి వీరాంజనేయులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివద్ధి శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌ కుమార్‌ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్తు బకాయిలు కింద తీసుకున్నందున ప్రస్తుతం నిధులను ఆపడం జరిగిందని తెలిపారు. విద్యుత్‌ చార్జీల కింద గ్రామ పంచాయతీలలో కేంద్ర పంపించే నిధులను డైరెక్ట్‌ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా గ్రామ పంచాయతీలే విద్యుత్తు డిస్కములకు చెల్లించే విధంగా స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నందున నిధులను అతి త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

➡️