ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట యువతకు రూ.35 కోట్ల టోకరా..

Nov 24,2023 15:36 #cheeting, #online jobs

అనంతపురం : భారీ సైబర్‌ మోసాన్ని అనంతపురం పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట యువతకు సైబర్‌ నేరగాళ్లు రూ.35 కోట్లకు టోకరా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రూ.2 లక్షలు కోల్పోయిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. గార్లదిన్నె పోలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో లింక్‌ పంపి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కొంతకాలం బాధితుల ఖాతాలకు రూ.30 బదిలీ చేసి వారిని మోసగాళ్లు నమ్మించారు. ఎక్కువ పనిచేస్తే లక్షల్లో ఇస్తామని యువతకు గాలం వేశారు. అయితే.. ముందుగా 10 శాతం డిపాజిట్‌ చేయాలని నిందితులు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పలువురు.. వారు చెప్పిన మొత్తాన్ని పంపించారు. ఆ తర్వాత తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సైబర్‌ నేరగాళ్లు మొత్తం రూ.35 కోట్లు వసూలు చేశారని గుర్తించారు. నెల్లూరు కేంద్రంగా మోసగాళ్లు యువతను మోసగిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 11 షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి.. 172 బ్యాంకు ఖాతాలకు సొమ్ము బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులోని ఓ బ్యాంక్‌ ఖాతాలో రూ.14 లక్షలు సీజ్‌ చేసి నిందితుడు సమద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

➡️