స్కాన్‌ చేయండి.. స్కామ్‌ చూడండి

Apr 12,2024 08:16
  •  బిజెపికి వ్యతిరేకంగా తమిళనాడులో పోస్టర్లు

చెన్నై : తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు జరగటానికి కొన్ని రోజుల సమయమే ఉన్నది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న అక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఈ ఎన్నికలను కేంద్రంలోని అధికార బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్కామ్‌(కుంభకోణం)కు పాల్పడిందంటూ పలు ప్రదేశాల్లో కనిపించాయి. ఈ పోస్టర్లలో పైభాగంలో ‘జీ పే’ అని రాసి ఉన్నది. ప్రధాని మోడీ ఫొటోతో పాటు దానిపై ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉన్నది. ”స్కామ్‌ చూడటానికి స్కాన్‌ చేయండి” అని దానిపై రాసి ఉన్నది. ఆ పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే ఒక వీడియో ఓపెన్‌ అవుతున్నది. ఈ వీడియోలో ఒక వ్యక్తి.. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి అవినీతి గురించి, కాగ్‌ నివేదిక హైలెట్‌ చేసిన అవకతవకల గురించి వివరిస్తూ కనిపిస్తుంది. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అవినీతి గురించి వివరించటమూ ఆ వీడియోలో ఉన్నది. బడా కార్పొరేట్లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను రైటాఫ్‌ చేసిందని ఆ వీడియో వివరించింది. బిజెపిని తిరస్కరించి, ఇండియా బ్లాక్‌కు మద్దతు తెలపండి అని ఓటర్లను కోరటం అందులో కనిపించింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈనెల 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఒక వారం రోజుల సమయమే మిగిలి ఉండటం, బిజెపి కేంద్ర అధినాయకత్వం రాష్ట్రంలోని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో ఇలాంటి పోస్టర్లు తమిళనాడులో దర్శనమివ్వటం ఆ పార్టీకి ప్రతికూల అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

➡️