అమెరికా మూన్‌ ల్యాండర్‌ ప్రయోగం విఫలం

Jan 10,2024 11:16 #America, #fail, #launch, #moonlander

వాషింగ్టన్‌ : అమెరికా తాజాగా ప్రయోగించి మూన్‌ ల్యాండర్‌ ప్రయోగం విఫలమయింది. అమెరికా ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ అభివృద్ధి చేసిన మూన్‌ ల్యాండర్‌ పెరెగ్రైన్‌ను చంద్రునిపై ప్రయోగాలు కోసం సోమవారం ప్రయోగించారు. ఫ్లోరిడాలోని కెఫ్‌ కెనావెరల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సోమవారం ఉదయం జరిపిన ఈ ప్రయోగం విజయవంతం అయినప్పటీకి… వ్యోమనౌక నుంచి విడిపోయిన కొద్దిసేపటికే పెరెగ్రైన్‌లో సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో చంద్రునిపై క్షేమంగా పెరెగ్రైన్‌ దిగలేకపోయింది. దీంతో అమెరికా నుంచి దాదాపు 50 ఏళ్ల తర్వాత చందమామపైకి ఒక ల్యాండర్‌ పంపాలని చేసిన ప్రయోగం విఫలమయింది. ఇంధన లీక్‌ కారణంగా వ్యోమనౌక కీలక ప్రొపెల్లెంట్‌ను కోల్పోయిందని ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ తెలిపింది. ఈ ల్యాండర్‌ కోసం 108 మిలియన్‌ డాలర్లకు ఆస్ట్రోబోటిక్‌తో.. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యోమనౌక ఎత్తు ఆరు అడుగులు. ఇందులో.. జాబిల్లిపై నీటి తీరుతెన్నులను శోధించే ‘పెరిగ్రిన్‌ అయాన్‌ మాస్‌ స్పెక్ట్రోమీటర్‌’ సహా పలు సైన్స్‌ పరికరాలు ఉన్నాయి. ఇంకా అనేక వస్తువులను భూమి నుంచి మోసుకెళ్లింది. వాటిలో.. ఎవరెస్టు పర్వతం నుంచి సేకరించిన రాతి తునక, చిన్న రోవర్లు, మెక్సికోకు చెందిన చక్రాల రోబోలు, వికీపీడియా ప్రతి, ఒక బిట్‌కాయిన్‌, కొన్ని ఫొటోలు, డ్రాయింగ్స్‌, ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు జాన్‌ ఎఫ్‌ కెనెడీ, జార్జ్‌ వాషింగ్టన్‌, ఐజన్‌హౌవర్‌, ‘స్టార్‌ ట్రెక్‌’ టీవీ ధారావాహిక సష్టికర్త జీన్‌ రాడన్‌బెర్రీ, ప్రముఖ సైన్స్‌ కాల్పనిక సాహిత్య రచయిత ఆర్థర్‌ సి క్లార్క్‌కు సంబంధించిన అవశేషాలు, డీఎన్‌ఏనూ ఈ వ్యోమనౌక వెంట తీసుకెళ్లింది.

➡️