తీర్మానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే

Mar 27,2024 00:30 #Netanyahu, #speech

భద్రతా మండలిని కోరిన పలువురు నేతలు
దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు
న్యూయార్క్‌: రంజాన్‌ మాసం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణకు భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని అరబ్బు దేశాలతో సహా పలు దేశాలు డిమాండ్‌ చేశాయి. భద్రతా మండలి తీర్మానాన్ని అమలు చేసి తీరాల్సిందేనని ఐరాస చీఫ్‌ గుటెరస్‌ ఉద్ఘాటించారు. గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాక్రమణ పూరిత యుద్ధాన్ని ఆపేందుకు భద్రతా మండలి తీర్మానం చేయడానికి ఆరు మాసాలు పట్టిందని, ఇప్పటికైనా తీర్మానం చేసినందుకు సంతోషమని ఐరాసలో పాలస్తీనా డిప్యూటీ శాశ్విత పరిశీలకులు మజీద్‌ బమ్యా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాల్పుల విరమణకు డిమాండ్‌ చేసినందుకు భద్రతా మండలికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అల్టీరియా రాయబారి అమర్‌ బెండ్‌జామా అన్నారు. గాజాలో కాల్పుల విరమణ తీర్మానానికి భద్రతా మండలి ఓటేస్తే చాలదు. ఈ తీర్మానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా మండలి తీసుకోవాలని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నాయకుడు, నార్త్‌ ఇస్లింగ్టన్‌ ఎంపి జెరిమి కార్బిన్‌ అన్నారు. గాజాపై యుద్ధం మానవాళికే మాయని మచ్చ. ఇప్పటికే 32వేల మందికిపైగా అమాయక పాలస్తీనా పౌరులు మరణించారు. శాంతి, న్యాయం, స్వతంత్ర పాలస్తీనా కోసం మన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గాజాలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్‌ దళాల తక్షణ ఉపసంహరణకు ఈ తీర్మానం బాటలు వేస్తుందన్న ఆశాభావాన్ని పీస్‌ అండ్‌ జస్టిస్‌ ప్రాజెక్టు ఉద్యమ కార్యకర్త లీసెష్టర్‌ ఈస్ట్‌ ఎంపి ఆ్లడియా రెబ్‌ వ్యక్తం చేశారు. పాలస్తీనా పట్టణం రఫాపై భూతల దాడులకు ఈ తీర్మానంతో బ్రేక్‌ పడుతుందని ఐరాసలో అరబ్‌ ప్రతినిధి అమర్‌ బెండ్జా అన్నారు. స్టాప్‌ది వార్‌ కోయెలేషన్‌ కన్వీనర్‌ లిండ్డే జర్మన్‌ అన్నారు. గాజాలో క్షామం ఇజ్రాయిల్‌ పుణ్యమేనని ఆయన విమర్శించారు. సోమవారం నాడు భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానానికి బ్రిటన్‌ ఓటు వేయడం అక్కడి ప్రజలు సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు. కన్సర్వేటివ్‌ పార్టీనేత, ప్రధాని రిషిసునాక్‌, లేబర్‌ పార్టీ నేత స్టార్మర్‌ ఇజ్రాయిల్‌ ఘాతుకాలకు జవాబుదారీ వహించాలని ఆయన కోరారు.
భద్రతా మండలి తీర్మానాన్ని తాను లెక్కచేయనని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు హూంకరించారు. వీటోను ఉపయోగించి ఈ తీర్మానాన్ని అడ్డుకోనందుకు అమెరికాపైనా ఆయన చిందులు వేశారు. రఫా పట్టణంపై భూతల దాడులకు ప్రత్యామ్నాయం గురించి చర్చించేందుకు తమ దౌత్య ప్రతినిధి బృందం జరపతలపెట్టిన వైట్‌ హౌస్‌ సందర్శనను రద్దు చేస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. బందీల విడుదల గురించి మండలి తీర్మానంలో ప్రస్తావించలేదని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. వైట్‌ హౌస్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ , బందీల విడుదల కాల్పుల విరమణలో భాగంగా ఉండాలని అమెరికా మొదటి నుండి చెబుతోందని, ,ఇందులో అ ప్రస్తావన లేనందునే ఓటింగ్‌కు గైర్హాజరయ్యామని చెప్పారు.
. ఇజ్రాయిల్‌ అనుకున్న లక్ష్యాల్లో ఏ ఒక్కదాన్ని కూడా సాధించలేకపోయిందని హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియె అన్నారు. పైగా ప్రపంచ దేశాల మద్దతును కూడా ఇజ్రాయిల్‌ కోల్పోతోందన్నారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాతో కలిసి ఆయన పత్రికా సమావేశంలో పాల్గని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్‌కు రాజకీయ మద్దతు కరువవుతోందని తాజాగా భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంతోనే అర్ధమవుతోందన్నారు.
గాజాలో ఆగని దాడులు
మరో 81 మంది మృతి
గత 24గంటల్లో గాజపై ఇజ్రాయిల్‌ సాగించిన దాడుల్లో 81 మంది చనిపోయారు. మరో 93మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ జరపాలంటూ హమాస్‌ చేస్తున్న డిమాండ్‌ను ‘కేవలం భ్రాంతికరమైన డిమాండ్‌’ అని ఇజ్రాయిల్‌ హేళనగా మాట్లాడింది.. రాఫాపై కొనసాగుతున్న దాడుల్లో భాగంగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఒక ఇంటిపై బాంబు దాడి చేయగా, 9మంది చిన్నారులతో సహా 18మంది మరణించారు. అక్టోబరు7 నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణ కాండలో 32, 333 మంది పాలస్తీనీయులు చనిపోయారు.
ఇదిలా వుండగా గత 72గంటల్లో ఎర్ర సముద్రంలో, అడెన్‌ జలసంధిలో నాలుగు నౌకలపై యెమెన్‌కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు అర డజను సార్లు దాడి చేశారు.

➡️