Kenya – కుప్పకూలిన సైనిక హెలికాప్టర్‌ – 10మంది మిలటరీ అధికారులు మృతి

Apr 19,2024 10:14

నైరోబీ (కెన్యా) : కెన్యాలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలి 10మంది మిలటరీ అధికారులు మృతి చెందిన దుర్ఘటన గురువారం జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో అధికారికంగా ప్రకటించారు.

కెన్యా స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.20 గంటలకు రాజధాని నైరోబీ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో సైనిక హెలికాప్టర్‌ లేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లా (61)తో పాటు తొమ్మిదిమంది మిలిటరీ అధికారులు మృతి చెందారు. తీవ్ర విచారంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు రూటో ప్రకటనలో పేర్కొన్నారు.

దర్యాప్తు బృందాన్ని పంపాం : అధ్యక్షుడు రూటో
వాయువ్య కెన్యాలో స్థానిక పశువుల రస్ట్లింగ్‌ను ఎదుర్కోవడనాకి మోహరించిన సైనిక దళాలను సందర్శించిన అనంతరం హెలికాఫ్టర్‌ వెస్ట్‌పోకోట్‌ కౌంటీలోని చెప్టులెల్‌ బాయ్స్ సెకండరీ స్కూల్‌ నుంచి తిరిగి బయలుదేరింది. కొద్ది నిమిషాలకే హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు బఅందాన్ని పంపామని అధ్యక్షుడు రూటో తెలిపారు.

ఆయన మరణం తీరని లోటు : రూటో సంతాపం
కెన్యా దేశం అత్యంత పరాక్రమవంతులైన వారిలో ఒకరైన జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లాను కొల్పోయిందని, ఆయన మరణం తీరని లోటని అధ్యక్షుడు రూటో సంతాపం వ్యక్తం చేశారు. ఒగొల్లా గతంలో కెన్యా వైమానిక దళాధిపతిగా ఫ్రాన్సిస్‌ విధులు నిర్వహించారు. డిప్యూటి మిలిటరీ చీఫ్‌గా మాధ్యతలు చేపట్టడానికి ముందు మిలిటరీకి అధిపతిగా పనిచేశారు. ఆయన గత ఏడాది డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రొఫైల్‌ ప్రకారం.. ఒగోల్లా 1984లో కెన్యా డిఫెన్స్‌ ఫోర్సెస్‌లో చేరారు. అక్కడ ఆయన యునైటెడ్‌ స్టేట్స్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఫైటర్‌ పైలట్‌గా, కెన్యా ఎయిర్‌ ఫోర్స్‌ లో ఇన్‌స్ట్రక్టర్‌ పైలట్‌గా శిక్షణ పొందారు. 40 ఏళ్లుగా ఆయన మిలిటరీలో సేవలు అందిస్తున్నారు.

➡️