Iran లో కాల్పులమోత – 28మంది మృతి

Apr 5,2024 09:56 #28, #Iran, #killed, #Shooting

దుబాయ్ : ఇరాన్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇరాన్‌ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య గురువారం పెద్దఎత్తున జరిగిన కాల్పుల్లో 28 మంది మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది భద్రతా దళాల సభ్యులు, 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. సిస్తాన్‌, బలూచిస్థాన్‌, రస్కా, సర్బజ్‌, చాబహర్‌లో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. పౌరులను బందీలుగా చేసుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి పౌరులను కాపాడారు. కాల్పులకు పాల్పడింది జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్ర ముఠా అని సమాచారం.

చబహార్‌ , రస్క్‌ నగరాల్లో రాత్రిపూట జైష్‌ అల్‌-అద్ల్‌ గ్రూప్‌, భద్రతా దళాల మధ్య ఘర్షణలు జరిగాయి. చాబహార్‌ను, రాస్క్‌లోని గార్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఉగ్రవాదులు విఫలయత్నం చేశారని డిప్యూటీ ఇంటీరియర్‌ మినిస్టర్‌ మజిద్‌ మిర్హమాది తెలిపారు. ఈ దాడిలో, సున్నీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పేద ప్రాంతంలో జరిగిన పోరాటంలో 10 మంది భద్రతా అధికారులు కూడా గాయపడ్డారు. షియా ఆధిపత్యం ఉన్న ఇరాన్‌లోని బలూచి జాతి మైనారిటీకి మరిన్ని హక్కులు, మెరుగైన జీవన పరిస్థితులు కావాలని జైష్‌ అల్‌-అడ్ల్‌ డిమాండ్‌ చేస్తోంది. సిస్తాన్‌-బలుచిస్తాన్‌లో ఇరాన్‌ భద్రతా దళాలపై ఇటీవలి సంవత్సరాలలో అనేక దాడులకు ఇది బాధ్యత వహించింది.

➡️