ఇరాన్‌ నేతల లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడి : ఐదుగురు మృతి

Jan 20,2024 15:45 #israel hamas war, #Syria

బీరూట్‌ : గత కొన్నినెలలుగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియాపై కూడా ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో నాలుగు అంతస్తుల భవనంలో ఇరాన్‌ – అలీన నాయకులు శనివారం సమావేశం కానున్నారు. దీంతో ఇరాన్‌ నేతల్ని లక్ష్యంగా చేసుకుని నాలుగు అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడికి పాల్పడింది. దీంతో ఆ భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు అని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ తెలిపింది. ఇరాన్‌ యొక్క ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌ (ఐఆర్‌జిసి), ఇరాన్‌ అనుకూల పాలస్తీనా వర్గాలకు సిరియా హైసెక్యూరిటీ జోన్‌ హోమ్‌గా ఉంది. అందుకే ఇరాన్‌ సీనియర్‌ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అబ్జర్వేటరీ డైరెక్టర్‌ రామి అబ్దెల్‌ రెహ్మాన్‌ అన్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగిన వెంటనే ఆకాశమంతా పొగ కమ్ముకుందని సిరియన్‌ స్టేట్‌ మీడియా నివేదించింది. ఇజ్రాయెల్‌ మజ్జే పరిసరాల్లోని నివాస భవనాన్ని లక్ష్యం చేసుకుని మరో దాడి జరిగిందని అధికారిక సనా వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే విషయాలను సనా సంస్థ వెల్లడించలేదు.

కాగా, మజ్జే ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, రాయబార కార్యాలయాలు, రెస్టారెంట్లు ఉన్నాయి. ‘పశ్చిమ మజ్జే ప్రాంతంలో జరిగిన పేలుడు క్షిపణి పేలుడు మాదిరిగానే ఉంది. నిమిషాల వ్యవధిలో అంబులెన్స్‌ల శబ్దం విన్నాను. ఆ సమయంలో పెద్ద పొగ మేఘాన్ని చూశా’ అని ఓ నివాసి తెలిపినట్లు ఫ్రెంచ్‌ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎఎఫ్‌పి తెలిపింది. పాలస్తీనా భూభాగం కోసం యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌.. సిరియా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దశాబ్ద కాలంలో కొన్ని వందలసార్లు సిరియాపై వైమానిక దాడులకు ఇజ్రాయెల్‌ పాల్పడింది.

➡️