దీర్ఘ వేదనకి వాక్యానువాదం ఇది!

May 27,2024 04:50 #book review, #Kavitha, #sahityam

చిన్ని చిన్ని పద్యాల గురించి ఆలోచించే కాలంలో రత్నాజీ నుంచి ఈ దీర్ఘ కవిత అందింది. అయిదారు పంక్తుల ”వొక్కపొద్దు పద్యాల” మధ్య ఇంత పెద్ద కవిత చదవడానికి నాకు కాస్తంత శిక్షణ కావలసి వచ్చిందంటే ఆశ్చర్యమేమీ లేదు. కవిత్వం వొక మూడ్‌ అనుకుంటే, అలాంటి సందర్భాల్లో రీడర్‌ కూడా అదే మూడ్‌లో ప్రవహిస్తూ పోతున్నప్పుడు- దానికి భిన్నమైన వాక్య సందోహం తారసపడితే కొంచెం అసౌకర్యంగా వుంటుంది. అలాంటి అసౌకర్యమైన స్థితిలో చదివాను రత్నాజీ దీర్ఘ కవిత.
ఇది యింకో రకంగా జాగాకి సంబంధించిన సమస్య కూడా! కాగితమ్మీదే కాదు, మనసులో ఆలోచనల్లో వొక విషయానికి మనం ఎంత జాగా ఇస్తామన్న సమస్య. కవిత్వంలో ఆ విషయాలకు ఇచ్చే జాగా మన తాత్విక గాఢతని బట్టి వుంటుంది, అంతకంటే ఎక్కువగా మన రాజకీయ దృష్టిని బట్టి వుంటుంది. గాజా గురించి రత్నాజీ ఇంత దీర్ఘ కవిత రాయడానికి పెద్ద కారణం ఆ రాజకీయ దృష్టి!
గాజా గురించి ఎంతమంది తెలుగు మేధావులు ఎన్ని రాసినా, సాహిత్య జీవుల నుంచి సరయిన స్పందన లేదని నా ఫిర్యాదు. ప్రపంచమంతా పనులన్నీ పక్కన పెట్టి, ఈ అన్యాయాన్ని గురించి గొంతెత్తున్న సమయంలో కూడా తెలుగు కవులూ రచయితలకు ఇది పెద్దగా పట్టలేదు. తనదైన వొక కుటీరంలో తెలుగు కవి ముణుక్కొని కూర్చొని వున్నాడు. ఈ దుర్మార్గమైన స్థితిని ధిక్కరించి, రత్నాజీ ఏకంగా దీర్ఘ కవితే నిరసన కేకలాగా ఎక్కుపెట్టి వదిలాడు.
”ఎందుకో ఈ పూట అన్నం
సయించటం లేదు”
అలాంటి అసహనం చెరబండరాజు కూడా అనుభవించాడు, ఆగస్టు పదిహేను నాడు. ఫైజ్‌ అహమద్‌ ఫైజ్‌ కూడా అదే పలవరింతలోంచి రాశాడు. ఇప్పుడు రత్నాజీ అదే వాక్యంలో తన రాజకీయ ప్రతిబింబాన్ని వెతుక్కుంటున్నాడు. అయితే, రత్నాజీ ఇందులో కాలాన్ని పట్టుకున్న పద్ధతి ఎలా వుందో చూడండి:
”సెల్ఫీ తీసుకుందామని
తోటల మధ్య నిలబడ్డాను
నా కాళ్ళ ముందో
పాలస్తీనా పిల్ల తల తెగిపడింది”
చేతిరాతతో పలకరించే కాలాన్ని దాటుకొచ్చి, ఇవాళ సాంకేతికతే భాషగా మారిన కాలంలో కూడా అదే నొప్పి. చెరబండరాజునో, ఫైజ్‌నో నడిపించిన కాలానికీ, ఇప్పుడు రత్నాజీని నడిపిస్తున్న కాలానికీ మధ్య చాలా తేడా వుంది. సానుభూతి, సహానుభూతి అనేవి ఏమాత్రం మిగలని దయారహిత కాలం ఇది.
ఈ దీర్ఘ కవిత 17 భాగాల 22 పేజీల గుండెకోత. నిజం చెప్పాల్సి వస్తే, ఈ కవిత గురించి మా ఇద్దరి సంభాషణ పోయిన అక్టోబరులో మొదలైంది. ”గెర్నికా ఓ పాలస్తీనా!” అనే శీర్షికతో రత్నాజీ ఈ దీర్ఘ కవితని ఫేస్‌బుక్‌ ద్వారా మనకి అందించాడు. ఈ సుదీర్ఘ కాలంలో రత్నాజీ ఈ కవితలో చాలా మార్పులు చేర్పులూ చేసుకున్నాడు. ప్రతి మార్పూ ఇప్పటి దీర్ఘ కవిత దాకా చేరిన పద్ధతి చూస్తే, వొక కవి తన కవితని పదునెక్కించడానికి యెలాంటి నిర్మాణ సాధనాలు సమకూర్చుకుంటాడో- అది విమర్శకులు చెప్పాల్సిన విషయం. కానీ, సాటి కవిగా అంతకంటే యెక్కువగా ఈ కవితని వొకటికి పదిసార్లు దగ్గిరగా చదువుకున్న రీడర్‌గా నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలు రెండు : 1. కవిత్వానికి రాజకీయాల రక్తస్పర్శ లేకపోతే అది నిర్జీవమే! 2. రాజకీయ బలం ఎంత వున్నా అందులో కవిత్వ తీవ్రత లేకపోయినా అది నిర్జీవమే!
ఆ రెండీటీని వొకటి చేసే ప్రయత్నమే రత్నాజీ దీర్ఘ కవితకి బలం! ఇందులోని ప్రతి వాక్యం అద్భుతమైన చుట్టరికాన్ని యేర్పర్చుకుంటూ, మనతో రక్త బంధాన్ని కోరుకుంటుంది. కవిత్వానికి వాక్యాల సముదాయమే బలగం కాదు, ఆ వాక్యాలు యెటు మళ్లుతాయన్న చైతన్యమే పెద్ద బలగం. మరీ ముఖ్యంగా- దీర్ఘ కవిత అనేది అలాంటి వొక చైతన్యవంతమైన బలగాన్ని యేర్పర్చుకునే రాజకీయ ప్రకటన.

– అఫ్సర్‌

➡️