America: నదిపై కూలిన వంతెన : నదిలో చిక్కుకున్న 20 మంది వాహనదారులు 

Mar 26,2024 16:33 #America, #bridge

వాషింగ్టన్‌ : ఓడ ఢకొీనడంతో అమెరికాలోని బాల్టిమోర్‌ నగరంలోని ప్రధాన వంతెన మంగళవారం కుప్పకూలిపోయింది. ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జి అడుగు భాగాన్ని కంటైనర్‌ షిప్‌ ఢకొీనడంతో ఈ వంతెన కూలిపోయి పటాప్‌స్కో నదిలో పడిపోయింది. ఈ వంతెనపై వెళుతున్న పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. దీంతో సుమారు 20 మంది వాహనదారులు నదిలో చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో బ్రిడ్జి మొత్తం ధ్వంసమైందని, నదిలో డజన్లకొద్దీ కార్లు,  పలు వాహనాలు పడిపోయాయని అందులో ట్రాక్టర్‌ వంటి భారీ వాహనాలు కూడా ఉన్నాయని బాల్టిమోర్‌ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్‌ కార్ట్‌రైట్‌ అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు.

కాగా, పటాప్‌స్కో నదిపై 2.6 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన నిర్మాణమై ఉన్నది. మున్సిపల్‌ బాల్టిమోర్‌కు నైరుతి దిశలో నాలుగు లైన్ల వంతెన ఇది. ఈ వంతెనను 1977లో ప్రారంభించడం జరిగింది. సంవత్సరానికి సుమారు 11 లక్షల కంటే ఎక్కువ వాహనాలు ఈ వంతెనపై వెళతాయి. ఈ బ్రిడ్జి రాజధాని వాషింగ్టన్‌ డిసి పక్కన యుఎస్‌ ఈస్ట్‌ కోస్ట్‌లోని పారిశ్రామిక నగరమైన బాల్టిమోర్‌ చుట్టూ ఉన్న రహదారి నెట్‌వర్క్‌లో ప్రధాన భాగంగా ఉంది.

ఈ వంతెనను ఢకొీట్టింది ‘డాలీ’ అనే సింగపూర్‌ ఫ్లాగ్‌ ఉన్న కంటైనర్‌ షిప్‌ అని ‘షిప్‌ మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ మెరైన్‌ ట్రాఫిక్‌’ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తమకు అందిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాల్టిమోర్‌ మేయర్‌ బ్రాండన్‌ స్కూట్‌, బాల్టిమోర్‌ కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ జానీ ఒల్సెజ్వస్కీలు చెప్పారు. ఈ ప్రమాదం వల్ల నదిలో చిక్కుకున్న వారిపట్ల ప్రార్థించండి అని ఒల్సెజ్వస్కీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️