మరో నల్లజాతీయుడి బలి

Apr 28,2024 10:51 #America, #man death, #police

-అమెరికాలో శ్వేత జాతి దురహంకారానికి
-జార్జి ఫ్లాయిడ్‌ తరహాలో మెడపై మోకాలితో అదిమి ఊపిరి తీశారు
వాషింగ్టన్‌ : అమెరికాలో శ్వేత జాతి దురహంకారం మరోసారి బుసలు కొట్టింది. నాలుగేళ్ల క్రితం జార్జి ఫ్లాయిడ్‌ను ఎలా అయితే మోకాలితో మెడపై గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి చంపారో అదే తరహాలో ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే నల్లజాతీయుడిని కాంటన్‌ పోలీసు అధికారి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఓహియోలోని కేంటన్‌ పోలీసు విభాగం విడుదల చేసిన బాడీ కెమెరా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. జార్జి ఫ్లాయిడ్‌ను డెరెక్‌ చావిన్‌ అనే శ్వేత జాతి పోలీస్‌ అధికారి తొమ్మిది నిమిషాల సేపు మోకాలితో మెడను అదిమి చంపడం పట్ల ఆనాడు అమెరికా అంతటా నిరసనాగ్రహాలు పెల్లుబికాయి. ఇప్పుడు టైసన్‌ మెడపై కాంటన్‌ పోలీస్‌ అధికారి మోకాలితో ఎనిమిది నిమిషాలసేపు అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. టైసన్‌ను చంపిన తీరు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక కారు ప్రమాదం కేసులో డ్రైవర్‌ ప్రమాదం అనంతరం ఒక బార్‌లోకి పారిపోయాడని గుర్తించిన పెట్రోలింగ్‌ అధికారులు అక్కడడకు వెళ్లారు. ఆ బార్‌ వద్ద నిల్చొని ఉన్న టైసన్‌ను అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. వారు తనను చంపడానికి వస్తున్నారంటూ టైసన్‌ కేకలు వేయడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ఆ తర్వాత పోలీసులు అతడిని నేలపై పడేసి, చేతికి బేడీలు వేశారు. ఒక అధికారి అతడి మెడపై మోకాలితో అదిమిపట్టాడు. ఈ క్రమంలో టైసన్‌ ”నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను” అని మొత్తుకోవడం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. అయినా అధికారులు వినిపించుకోలేదు. అరవద్దు, నోరు మూసుకో అంటూ ఒక అధికారి తిట్టడం కూడా వినిపించింది. దాదాపు ఆరు నిముషాల తర్వాత టైసన్‌లో ఎలాంటి చలనం కనిపించపోవడంతో ‘బతికున్నాడా లేదా’ అనుకుంటూ పోలీసులు ఆయన చేతికున్న బేడీలు తీసివేసి, సిపిఆర్‌ చేయడం వీడియోలో కనిపించింది. ఆ వెంటనే స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్‌్‌లో తరలించారు. అప్పటికే ఆయన మరణించారు. ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు ఓహియో పోలీసులు నిరాకరించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని మాత్రమే చెప్పారు. .టైసన్‌ మృతికి కారకులైన ఇద్దరు పోలీస్‌ అధికారులను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది.
పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో మహిళా ప్రొఫెసర్‌పై దాష్టీకం
పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అమెరికాలోని అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో ఓ మహిళా ప్రొఫెసర్‌ను పోలీసులు కిందపడేసి ఆమె చేతికి బేడీలు వేశారు. ప్రొఫెసర్‌ కరోలిన్‌ ఫెలిన్‌ను కింద పడేసి, ఆమె రెండు చేతులను హ్యాండ్‌కప్‌తో కట్టేశారు. విద్యార్థులను వదిలేయాలని ఆమె వేడుకున్నది. ఆ సమయంలో ఓ పోలీసు వచ్చి ఆమెను నెట్టేశాడు. ఇక ఆ తర్వాత మరో పోలీసు వచ్చి కిందపడేసి చేతులకు జిప్‌ వేశారు. నేను ప్రొఫెసర్‌ను అంటూ ఆమె అరిచినా పట్టించుకోలేదు. పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో తొలుత నిరసన ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి.

➡️