సియోల్‌లో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు- 22మంది మృతి

మృతుల్లో చైనా వలస కార్మికులే ఎక్కువ
సియోల్‌ : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సమీపంలోని లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 22మంది మరణించారు. వీరిలో ఎక్కువమంది చైనా వలస కార్మికులే వున్నారని అధికారులు తెలిపారు..కార్మికులు బ్యాటరీలను పరీక్షించి, ప్యాకింగ్‌ చేస్తుండగా అవి పేలాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.. సియోల్‌కు దక్షిణంగా గల వాసెంగ్‌ నగరంలో ఫ్యాక్టరీ రెండో అంతస్తులో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ఆ ప్రాంతంలో అగ్ని మాపక యంత్రాలు వున్నాయా? లేదా? అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరణించిన వారిలో 18 మంది చైనీయులు కాగా, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఒకరు లావో జాతీయుడని స్థానిక అగ్నిమాపక దళాధికారి కిమ్‌ జిన్‌ యంగ్‌ చెప్పారు. మరొకరి జాతీయత ఇంకా తెలియాల్సి వుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ఒక వర్కర్‌ ఫోన్‌కు అందుబాటులో లేరని, ఆ వ్యక్తి కోసం సంఘటనా స్థలంలో గాలిస్తున్నారని కిమ్‌ తెలిపారు.

➡️