లండన్‌ నుండి సైపాస్‌ దాకా… అసాంజె ప్రస్థానం

Jun 25,2024 23:50 #Jail, #Julian released, #WikiLeaks

వాషింగ్టన్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజె విడుదల భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఇన్నేళ్లుగా పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారందరికీ సంతోషించే గొప్ప వార్త అనడంలో సందేహం లేదు. ఇంగిత జ్ఞానం, మీడియా స్వేచ్ఛ, మానవ మర్యాదకు లభించిన విజయమిది. తమ సైనిక సమాచారం బహిర్గతమైందన్న కారణంతో అసాంజె గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించారని అమెరికా అభియోగాలు మోపింది. ఆ నేరం రుజువైతే అసాంజెకు 176 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఆయనను అమెరికాకు అప్పగించేలా అమెరికా అనేక విధాలుగా ప్రయత్నించింది. ఒబామా ప్రభుత్వం ఆయనను అమెరికాకు తీసుకొచ్చి ప్రాసిక్యూట్‌ చేయాలని చూసింది. అయితే, ఇది పత్రికా స్వేచ్ఛతో ముడిపడి ఉన్న అంశం కావడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అసాంజెపై తీమ్రైన సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ తయారు చేసింది. సిఐజె మాజీ చీఫ్‌ మైక్‌ పాంపియో ఇందుకు అవసరమైన స్క్రిప్టు తయారు చేశారు. అదే సమయంలో అసాంజెను లండన్‌లోనే హత్య గావించేందుకు కుట్ర కూడా పన్నారు. బైడెన్‌ ప్రభుత్వం కూడా అసాంజెను అమెరికా గడ్డపై విచారించి కఠినాతికఠినంగా శిక్షించాలని చూసింది. కానీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడిన వారి కృత నిశ్చయం, అంకిత భావం కలిగిన ప్రగతిశీల శక్తుల పోరాటం వల్ల అది సాధ్యం కాలేదు. చిట్టచివరకు అసాంజెతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అసాంజె చేసిన ఈ సుదీర్ఘమైన న్యాయ పోరాటం వివిధ రూపాల్లో 14ఏళ్ల పాటు సాగింది. ఈక్వెడార్‌ ఎంబసీలో ఏడేళ్లు, లండన్‌కు దక్షిణాన నగర శివార్లలోని బెల్‌మార్ష్‌ సూర్‌మాక్స్‌ జైల్లో ఐదేళ్లు ఆయన గడిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబంతో గడపాలని ఆయన అనుకున్నాడు. బుధవారం ఉదయం పశ్చిమ పసిఫిక్‌లోని నార్తర్న్‌ మారియానాస్‌ దీవుల రాజధాని సైపాన్‌కు చేరుకుంటారు. అక్కడ విచారణ జరగనుంది. ఇది ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉంది. అమెరికాకు వెళ్లడానికి అసాంజె నిరాకరించినందువల్ల ఈ దీవిలో విచారణ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎక్స్‌్‌లో వికీలీక్స్‌ ఒక పోస్టు పెట్టింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన, పోరాడిన, ఉద్యమించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఆఫ్ఘన్‌, ఇరాక్‌ యుద్ధాలకు సంబంధించి అమెరికా మిలటరీ సమాచారం 2009లో అసాంజెకు లభించింది. దాదాపు 5లక్షల రికార్డులు కలిగిన ఈ డంప్‌లో ఎక్కువ రహస్య పత్రాలే వున్నాయి. సూక్ష్మాతిసూక్ష్మంగా మిలటరీలోని ముఠాలు, మానవ హక్కుల అక్రమాలు, ఇతర అకృత్యాల గురించిన సమాచారం వుంది. ఈ సమాచారాన్ని యథాతథంగా ప్రచురించడమే అసాంజెకు ముప్పు తెచ్చిపెట్టింది. ఎలాగైనా జైల్లో పెట్టాలని వరుసగా ఒబామా, ట్రంప్‌, బైడెన్‌ ప్రభుత్వాలు ప్రయత్నించాయి. పత్రికా స్వేచ్ఛకు ముప్పు కలుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అసాంజెకు అనూహ్యమైన మద్దతు లభించింది. అసాంజె కేవలం జర్నలిస్టుగా మాత్రమే వ్యవహరించారంటూ ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపారు.

➡️