రఫాలోకి యుద్ధ ట్యాంకులు

May 9,2024 07:17 #gaja, #rafa
  • మానవతా సాయం సరఫరాల బంద్‌
  •  పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంకులు సోమవారం గాజా దక్షిణ నగరమైన రఫాలోకి చొరబడ్డాయి. కైరో చర్చల్లో హమాస్‌ ఒప్పందానికి అంగీకరించిన కొద్ది సేపటికే ఇజ్రాయిల్‌ ఈ సైనిక చర్యకు దిగింది. ఇజ్రాయిల్‌ చర్య మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో తొమ్మిది మంది పిల్లల, ఆరుగురు మహిళలతో సహా 27 మంది చనిపోయినట్లు సిఎన్‌ఎన్‌ తెలిపింది ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నుండి లక్షలాది మంది పాలస్తీనా పౌరులను తరిమేస్తోంది. రఫా నుంచి ఈజిప్టుకు అనుసంధాం ఉన్న రెండు ప్రధాన రూట్లను ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంకులను పంపి మూసేసింది. రఫాలో ప్రజలకు మానవతా సహాయం అందించడంలో ఈ రెండు కీలకమైన ఎంట్రీ పాయింట్లుగా ఉన్నాయి. వీటిని మూసివేయడంతో పాలస్తీనా ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే ఉత్తర గాజాలో తాగు నీరు, ఆహారం, మందులు అందక అనేక మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు రఫాను అటువంటి విపత్తులోకి నెట్టాలని నెతన్యాహు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే ప్రాణాలు అర చేతపట్టుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరుగులు తీస్తున్న పాలస్తీనా పౌరులు ఇప్పుడు రఫా సరిహద్దులను మూసివేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అందోళన చెందుతున్నారు. పౌరులకు మానవతా సరఫరాలను అడ్డుకోవద్దని అంతర్జాతీయ సమాజం హెచ్చరించినా ఇజ్రాయిల్‌ ఖాతరు చేయడం లేదు. టెర్రరిస్టు అవసరాలకు ఈ రూట్లు ఉపయోగపడుతు న్నాయని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అది చూపలేదు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన నెతన్యాహు మాట్లాడుతూ, రఫాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్య గాజాలో బందీలుగా ఉన్నవారిని విడిపించుకురావడం, హమాస్‌ను నిర్మూలించడం అనే జంట లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇజ్రాయిల్‌ యుద్ధ క్యాబినెట్‌ సభ్యుడు బెన్నీ గాంట్జ్‌ మాట్లాడుతూ, రఫాలో ఇజ్రాయిల్‌ సైనిక కార్యకలాపాలు అవసరమైనప్పుడు కొనసాగుతాయి, విస్తరించబతాయి అని చెప్పారు.
రఫాపై దాడి చేస్తే అది 1979 శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘించడమే అవుతుందని ఈజిప్టు ఇప్పటికే హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న సామూహిక దురాగతాలు, మారణహోమంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. పాలస్తీనా శరణార్ధి శిబిరాన్ని శ్మశాన వాటికగా మార్చేందుకే రఫాపై దాడి ఉద్దేశంగా ఉన్నట్లు అనిపిస్తోందని ‘డాక్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌’ ఎగ్జిక్యుటివ్‌ డైరక్టర్‌ అవ్రిల్‌టెనాయిట్‌ పేర్కొన్నారు. రఫాపై దాడి పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం నాడు ఒక వాషింగ్టన్‌లో హోలోకాస్ట్‌ మెమోరియల్‌ మ్యూజియం వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ పాలస్తీనీయులపై సాగిస్తున్న ఊచకోతకు అమెరికా మద్దతు తెలపడాన్ని సమర్థించుకు న్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు 60 లక్షల మంది యూదులను చంపేసిన దురంతాన్ని, 2023అక్టోబరు7న హమాస్‌ ఇజ్రాయిల్‌పై జరిపిన రాకెట్ల దాడిని బైడెన్‌ ఒకేగాటన కట్టేలా మాట్లాడారు. ఇది చరిత్రను పూర్తిగా వక్రీకరించడం తప్ప మరొకటి కాదు.

యుద్ధ సామగ్రి సరఫరా నిలిపివేత!
ఇజ్రాయిల్‌కు అమెరికా ఆయుధాల సరఫరాపై వైట్‌ హౌస్‌ నుంచి గత కొద్ది రోజులుగా పరస్పర విరుద్ధమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ గాజా నగరమైన రఫాపై ఇజ్రాయిల్‌ భూతల దాడులకు దిగిన నేపథ్యంలో ఆ దేశానికి ఆయుధసామగ్రి సరఫరాను బైడెన్‌ ప్రభుత్వం నిలిపేసినట్లు రెండు మీడియా సంస్థలు తెలిపాయి. అలాగే 26 కోట్ల డాలర్ల విలువైన బాంబుల కొనుగోలుకు సంబంధించిన నెతన్యాహు ప్రతిపాదనపై నెమ్మదిగా స్పందించాలన్న వైఖరిని తీసుకున్నట్లు ఆ మీడియా సంస్థలు తెలిపాయి. అయితే, వీటిపై వ్యాఖ్యానించేందుకు బైడెన్‌ ప్రభుత్వ ప్రతినిధి నిరాకరించారు. ఇంకోవైపు అమెరికా జాతీయ భద్రతా మండలి కో-ఆర్డినేటర్‌ జాన్‌ కిర్బీ ఇజ్రాయిల్‌కు హామీ ఇచ్చిన క్షిపణి నిరోధక ఉక్కుకవచాలను (ఐరన్‌క్లాడ్‌లను) పంపాలని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆదివారం ‘యాక్సియోస్‌’ ప్రచురించిన ఒక వ్యాసంలో ఇజ్రాయిల్‌కు అమెరికన్‌ తయారీ మందుగుండుసామగ్రి సరఫరాను బైడెన్‌ ప్రభుత్వం నిలిపేసినట్లు ఇద్దరు పేరు తెలపడానికి ఇష్టపడని అధికారులనుటంకిస్తూ తెలిపారు. అయితే దీనిపై అటు వైట్‌ హౌస్‌ కానీ, పెంటగాన్‌ కానీ, ఇటు నెతన్యాహు కార్యాలయం కానీ ఇంతవరకు స్పందించనే లేదు. రెండవ వార్తా కథనం వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నుంచి వచ్చింది. అందులో ఇజ్రాయిల్‌ ఇటీవల ఆర్డర్‌పెట్టిన జైంట్‌ ఎంకె-82 బాంబలు, ఫ్యూజులు, స్మార్ట్‌ బాంబు గైడెన్స్‌ కిట్స్‌ ఇతర ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఆమోదాన్ని జాప్యం చేయాలని బైడెన్‌ ప్రభుత్వం చెప్పినట్లు ఆ వార్తా కథనం పేర్కొంది.

➡️