మిచిగన్‌ ప్రైమరీలో బైడెన్‌, ట్రంప్‌లు విజయం

Feb 29,2024 09:03 #America, #Presidential Elections
Biden and Trump win in Michigan primary

వచ్చే మంగళవారం మరో 21 రాష్ట్రాల్లో ప్రైమరీలు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లిరువురూ మంగళవారం మిచిగన్‌ ప్రైమరీలో వారి వారి పార్టీల తరపున విజయం సాధించారు. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఇరువురు ముందుకు సాగుతున్నారు. ప్రధాన ప్రత్యర్ధి, ఇండియన్‌ అమెరికన్‌ నిక్కీ హేలీని ట్రంప్‌ అతి సునాయాసంగా ఓడించారు. తద్వారా రిపబ్లికన్‌ పార్టీ నామినేషన్‌ను పొందడానికి మరో అడుగు ముందుకేశారు. కడపటి వార్తలందేసరికి, నిక్కీ హేలీకి 28.9శాతం ఓట్లు రాగా, ట్రంప్‌కు 66.4శాతం ఓట్లు లభించాయి. 40శాతం పైగా ఓట్లతో మిచిగన్‌ ప్రైమరీని ట్రంప్‌ కైవసం చేసుకుంటారని న్యూయార్క్‌ టైమ్స్‌ ముందుగానే అంచనా వేసింది. తనను గెలిపించిన మిచిగన్‌ ఓటర్లకు బైడెన్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. మిచిగన్‌ ప్రైమరీలో ముఖ్యమైన అంశం ఏమంటే అక్కడ ముస్లిం జనాభా గణనీయంగా వున్నారు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధాన్ని నివారించడంలో బైడెన్‌ సరిగా వ్యవహరించలేదని వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ దాదాపు 20శాతం ఓట్లు కోల్పోయారు. మిచిగన్‌లో ఏం జరిగిందో అదే దేశవ్యాప్తంగా కొనసాగేందుకు అవకాశాలు వున్నాయనడానికి ఇదొక హెచ్చరిక వంటిదని పార్టీ జాతీయ ప్రతినిధి అలీవియా పెరెజ్‌ వ్యాఖ్యానించారు. వచ్చే మంగళవారం 21 రాష్ట్రాల్లో ప్రైమరీలు జరగనున్నాయి. ప్రస్తుత ధోరణిని చూస్తుంటే మార్చి 2కల్లా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా ట్రంప్‌ ఆవిర్బవించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

➡️