కాల్పుల విరమణ కోరలేదు

Dec 25,2023 08:48 #israel hamas war, #White House
  •  వెల్లడించిన బైడెన్‌
  • నెతన్యాహుతో సుదీర్ఘంగా ఫోన్‌లో చర్చలు

గాజా    :   అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహు గాజాలో సాగుతున్న మిలటరీ ఆపరేషన్‌ లక్ష్యాలు, వాటి తీరుతెన్నులపై చర్చించారు. ఇరువురు నేతలు టెలిఫోన్‌లో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ గురించి తాను నెతన్యాహును అడగలేదని బైడెన్‌ చెప్పారు. శనివారం నెతన్యాహుతో జరిపిన సుదీర్ఘ సంభాషణను ప్రైవేట్‌ సంభాషణ అని తేల్చేశారు.ఈ సంభాషణలో కాల్పుల విరమణ ప్రస్తావనే రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తర్వాత వైట్‌హౌస్‌ దీనిపై ఒక ప్రకటన విడుదలజేసింది. గాజాలోని పౌరులను కాపాడాల్సిన అవసరాన్ని బైడెన్‌ నొక్కి చెప్పారని ఆ ప్రకటన పేర్కొంది. అలాగే మిగిలిన బందీలను సురక్షితంగా విడుదల చేయాల్సిన అవసరం వుందన్నారు. గాజాలో తక్షణమే సాయాన్ని పెంచాల్సిన అవసరం వుందని కోరుతూ భద్రతామండలి తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఇరువురు నేతలు చర్చించారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీసుకున్న వైఖరిని నెతన్యాహు ఈ సందర్భంగా అభినందించారు.హమాస్‌ను నాశనం చేసేవరకు యుద్ధం ఆపేది లేదని నెతన్యాహు ఎప్పటిలానే హూంకరించారు.

  • గాజాపై బాంబు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి

గాజాపై ఇజ్రాయిల్‌ శనివారం జరిపిన బాంబు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది చనిపోయారు. గత 24గంటల్లో మొత్తంగా 200మందికి పైగా మరణించారు. రఫా ప్రాంతంలో ఓ గృహ సముదాయంపై ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపించడంతో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది, అదే గృహ సముదాయంలో నివసిస్తున్న 16 మంది బంధువులు చనిపోయారు. వీరిలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి నిధిలో సీనియర్‌ ఉద్యోగి ఇస్సామ్‌ అల్‌ ముఖ్రాబీ కూడా ఉన్నారు. గాజా పౌరలుకు సహాయం అందించేందుకు కృషి చేస్తున్న ఐరాస, రెడ్‌క్రాస్‌ సంస్థల సిబ్బందిపైన ఇజ్రాయిల్‌ నిరంతరం దాడులు చేస్తోంది.అక్టోబరు7 న ప్రారంభమైన ఇజ్రాయిల్‌ హంతక దాడుల్లో ఇంతవరకు 20 వేల మందికిపైగా పాలస్తీనియన్లు చనిపోయారు.

➡️