అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌కు తొలి విజయం

Feb 5,2024 10:41
Biden's first victory in the presidential nomination race

కొలంబియా : డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్‌ తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో శనివారం ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్‌ విలియమ్సన్‌పై బైడెన్‌ గెలుపొందారు. 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని బైడెన్‌ అన్నారు. 2024లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని అన్నారు.

దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుంది. ఇక్కడి ఓటర్లలో 26 శాతం నల్లజాతీయులే. దేశం మొత్తం ఓటర్లలో వీరి వాటా 11 శాతం. ఏపీ ఓట్‌క్యాస్ట్‌ సర్వే ప్రకారం.. గత ఎన్నికల్లో ప్రతి 10 మంది నల్లజాతీయుల్లో 9 మంది బైడెన్‌కు ఓటు వేశారు. తాజా ప్రైమరీలోనూ బైడెన్‌ గెలుపునకు వారే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నెవాడాలో, ఫిబ్రవరి 27న మిషిగన్‌, మార్చి 5న పలు రాష్ట్రాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రైమరీలు జరగనున్నాయి.

 

➡️