కోవిడ్‌ టీకాపై బోల్సనారో తప్పుడు సమాచారం

  •  పోలీసు అధికారుల అభిశంసన

బ్రసీలియా : కోవిడ్‌ మహామ్మారి వేళ టీకాల డేటాపై బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జేర్‌ బోల్సనారో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బ్రెజిల్‌ ఫెడరల్‌ పోలీసులు అభిశంసించారు. ఆనాడు అధ్యక్షుడిగా వున్న బోల్సనారో, ఆయన 12 ఏళ్ళ కుమార్తె, ఆయన సన్నిహితుల్లో మరికొంతమంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ డేటాబేస్‌లో తప్పుడు సమాచారాన్ని వుంచారంటూ బోల్సనారోతో సహా మరో 16 మందిపై పోలీసు విభాగం తీవ్రంగా విమర్శలు చేసింది. ఇందుకు సంబంధించి పోలీసుల అభిశంసన పత్రాన్ని సుప్రీం కోర్టు మంగళవారం విడుదల చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా గళం వినిపించిన కొద్ది మంది నేతల్లో బోల్సనారో ఒకరు. ఆయన బాహటంగానే కోవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తూ, ప్రజలు కూడా తనను అనుసరించాలని కోరారు. అయితే సుప్రీం కోర్టులో బోల్సనారోపై అభియోగాలు నమోదు చేయడానికి ఈ పోలీసుల అభిశంసన పత్రాన్ని ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై బ్రెజిల్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. కాగా దీనిపై బోల్సనారో తరపు న్యాయవాది తక్షణమే స్పందించలేదు. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా డసిల్వా తిరిగి ఎన్నికైన రెండు మాసాల తర్వాత 2022 డిసెంబరులో అమెరికాకు వెళ్ళిపోవడానికి కాస్త ముందుగా బోల్సనారో, ఆయన సహచరులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాబేస్‌లో అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు. ఆరోగ్య డేటాలో తప్పుడు సమాచారం చొప్పించినట్లు రుజువైతే బోల్సనారోకు 12ఏళ్ళ జైలు శిక్ష విధించే అవకాశం వుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలోకి ప్రవేశించాలంటే బోల్సనారోకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ అవసరం. ఇదిలావుండగా, 2022 ఎన్నికల ప్రచారం సందర్భంగా తన అధికారాన్ని దుర్వినియోగపరచడమే కాకుండా దేశ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేసినందున 2030 వరక ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని బ్రెజిల్‌ ఉన్నత ఎలక్టోరల్‌ కోర్టు ప్రకటించింది.

➡️