Rajasthan – ట్రక్కును ఢీకొట్టిన కారు – ఏడుగురు సజీవదహనం

సికార్‌ (రాజస్థాన్‌) : ట్రక్కును కారు ఢీకొట్టుకోవడంతో ఏడుగురు సజీవదహనమైన ఘటన ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్‌లో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట నివాసితులు రాజస్థాన్‌లోని సలాసర్‌లో ఉన్న సలాసర్‌ బాలాజీ ఆలయం నుండి తిరుగు ప్రయాణమయ్యారు. చురు వైపుగా వెళుతున్న కారును డ్రైవర్‌ ట్రక్కును ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఎదురుగా మరో వాహనం రాగానే ఆ వాహనాన్ని ఢీకొట్టకుండా చేసే ప్రయత్నంలో అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో వెంటనే కారులోని గ్యాస్‌ కిట్‌లో మంటలు రాజుకున్నాయి. ట్రక్కులో లోడ్‌ చేసి ఉన్న కాటన్‌ ఆ మంటలను ఇంకా చెలరేగేలా చేసింది. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మంటలు ఎక్కువ కావడంతో లాక్‌ చేసి ఉన్న డోర్లను తీయకపోవడంతో కారులో ఉన్నవారంతా సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇంతలో లారీ డ్రైవర్‌, హెల్పర్‌ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు.

ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన రామ్‌నివాస్‌ సైనీ మాట్లాడుతూ … ప్రయాణికులు సహాయం కోసం అరుస్తున్నారని, అయితే మంటల కారణంగా తాను వారికి సహాయం చేయలేకపోయానని చెప్పారు. అగ్నిమాపక దళం వాహనాలను మోహరించింది. అయితే మంటలను అదుపులోకి తెచ్చే సమయానికి కుటుంబ సభ్యులు మరణించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మఅతులు నీలం గోయల్‌ (55), ఆమె కుమారుడు అశుతోష్‌ గోయల్‌ (35), మంజు బిందాల్‌ (58), ఆమె కుమారుడు హార్దిక్‌ బిందాల్‌ (37), అతని భార్య స్వాతి బిందాల్‌ (32), వారి ఇద్దరు మైనర్‌ కుమార్తెలుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు యజమాని అశుతోష్‌ ఏడాదిన్నర క్రితం కారును విక్రయించాడు. పోలీసులు కారు విక్రయించిన ఏజెంట్‌ను సంప్రదించి, అతని ద్వారా కుటుంబాన్ని గుర్తించగలిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️