శాశ్వత కాల్పుల విరమణే పరిష్కారం

cease fire is solution for conflicts

అమెరికా ప్రజల డిమాండ్‌
ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది ఓటర్ల మద్దతు
వాషింగ్టన్‌ : గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని, శాశ్వత కాల్పుల విరమణ జరగాలని అమెరికా ప్రజానీకం అక్కడి ప్రభుత్వ పెద్దలను డిమాండ్‌ చేస్తున్నారు. శాశ్వత కాల్పుల విరమణతోనే గాజా సమస్యకు పరిష్కారం లభిస్తుందని నినదిస్తున్నారు. డేటా ఫర్‌ ప్రొగ్రేస్‌ సంస్థ ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది అమెరికన్‌ ఓటర్లు శాశ్వత కాల్పుల విరమణకు మద్దతు తెలిపారు. కాగా కేవలం 11 శాతం మంది అమెరికా చట్టసభల సభ్యులు మాత్రమే ఇజ్రాయిల్‌ యుద్ధం ముగింపునకు మద్దతిస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌కి చెందిన మహిళా ప్రతినిధి రషిదా తలైబ్‌ ఈ పోల్‌ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. డెమోక్రటిక్‌ ఓటర్లలో 76 శాతం మంది కాల్పుల విరమణకు మద్దతిస్తున్నారని చెప్పారు. ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ఇజ్రాయిల్‌కు ఆయుధాలు పంపేందుకు, అదనపు సైనిక సాయం అందించేందుకు అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 11 శాతం మంది ప్రజలు మాత్రమే ఇజ్రాయిల్‌ బలగాలకు సాయంగా అమెరికా సైనికులను పంపడం ప్రాధాన్యతా చర్యగా ఎంపిక చేసుకోవాలని భావించారని పేర్కొంది. దాదాపు సగం మంది సభ్యులు దౌత్యపరమైన ప్రయత్నాలు జరగాలని కోరుతున్నారు. కేవలం 11శాతం మంది మాత్రమే గాజాలో ఇజ్రాయిల్‌ బలగాలను అదనంగా మోహరించేందుకు అమెరికాకు మద్దతిచ్చారు. పాలస్తీనియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలైన తలైబ్‌ను నవంబరు 7న అమెరికా ప్రతినిధుల సభ అభిశంసించింది. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధంలో కాల్పుల విరమణ జరగాలంటూ కొద్ది మంది చట్టసభల సభ్యులు మాత్రమే డిమాండ్‌ చేయడాన్ని ఆమె విమర్శించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికాలో యూదు కమ్యూనిటీలు, అరబ్బులు, ముస్లింలు పట్ల విద్వేషం పెరుగుతుండడంపై మెజారిటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారని డేటా ఫర్‌ ప్రోగ్రెస్‌ సర్వే పేర్కొంది. ఈ విద్వేషాన్ని యూదు వ్యతిరేకతతో సమం చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఒక బిల్లును మంగళవారం ఆమోదించింది. కాగా పాలస్తీనా హక్కుల సంస్థ ఈ చర్యను ప్రమాదకరమైనదిగా అభివర్ణించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి ఉద్దేశించిన చర్యగా పేర్కొంది. గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్యను 45 శాతం మంది విభేదించారని గాలప్‌ నిర్వహించిన పోల్‌ పేర్కొంది. ప్రస్తుతం ఇజ్రాయిల్‌-హమస్‌ పరిస్థితుల పట్ల బైడెన్‌ వ్యవహరిస్తున్న తీరును 32శాతం మంది ఆమోదించారని తెలిపింది.

➡️