ఇజ్రాయిల్‌ సైన్యం కర్కశత్వం

Dec 14,2023 09:50 #Israel
cop shooting in point block israel

పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో నిర్వాసితులను చంపేసిన వైనం

గాజా : ఇజ్రాయిల్‌ ముమ్మరంగా జరుపుతున్న దాడులతో సర్వం కోల్పోయి నిర్వాసితులైన వారు పాఠశాలల్లో తల దాచుకుంటున్నారు. వారిని పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో సైన్యం హతమార్చింది. అల్‌ ఫలుజా ఏరియాలోని షాదియా అబూ ఘజాలా స్కూల్లో వరుసగా పేర్చబడిన మృతదేహాలకు సంబంధించిన వీడియో, ఫొటోలు మీడియాకు అందాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్ధ శిబిరానికి పశ్చిమంగా ఈ స్కూలు వుంది. గాజాలో మంగళవారం జరిగిన దాడుల్లో తమ కల్నల్‌తో సహా 10మంది సైనికులు మరణించారని ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. మరోవైపు ఇజ్రాయిల్‌ తక్షణమే కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 18,608మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, అక్టోబరు 7నాటి దాడుల తర్వాత నుండి ఇప్పటివరకు అమెరికా నాలుగు దఫాలుగా ఆంక్షలు విధించింది. తాజాగా 8మంది హమస్‌ అధికారులు, మధ్యవర్తులపై అమెరికా ఆంక్షలు విధించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. విదేశాల్లో హమస్‌ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే వారిని ఈసారి లక్ష్యంగా చేసుకున్నట్లు మిల్లర్‌ తెలిపారు. బ్రిటన్‌తో కలిసి ఈ విషయంలో సమన్వయంగా వ్యవహరిస్తున్నామని మిల్లర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ గురువారం ఇజ్రాయిల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో ఆయన నెతన్యాహుతో, ఇతర కేబినెట్‌ సభ్యులతో కలిసి చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. వచ్చే వారం పెంటగన్‌ చీఫ్‌ లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ఇజ్రాయిల్‌లో పర్యటించనున్నారు. గాజాపై విచక్షణారహితంగా కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ మద్దతును, తోడ్పాటును కోల్పోతోందంటూ బైడెన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ పర్యటనలన్నీ జరుగుతున్నాయి.

➡️