సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు

Mar 11,2024 23:52 #floods, #Indonesia
  •  26మంది మృతి, 11మంది గల్లంతు

జకార్తా : ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో కుండపోత వర్షాలతో ఆకస్మికంగా సంభవించిన వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటనల్లో 26మంది మరణించగా, మరో 11మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం తెలిపారు.
గురువారం నుండి పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో 9 జిల్లాలు, నగరాలు నీట మునిగాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత పెద్ద ఎత్తున మట్టిపెళ్లలు, కొండచరియలు విరిగిపడడంతో నది కట్టలు తెగి ఊర్లలోకి వరద ప్రవహించింది. సెలాటన్‌ జిల్లాలో కొండల పక్కన గల గ్రామాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. ప్రస్తుతానికి నీటి మట్టం తగ్గడంతో సహాయక సిబ్బంది మరిన్ని మృతదేహాలను వెలికితీస్తున్నారు. విద్యుత్‌ లేకపోవడం, వంతెనలు తెగిపోవడం, రహదారులు ధ్వంసమవడం, పెద్ద మొత్తంలో బురద, రాళ్లు రప్పలతో కూడిన శిధిలాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సెలాటన్‌, దాని పొరుగునే గల పరియామన్‌ జిలాల్లోని అనేక గ్రామాలు బాగా దెబ్బతిన్నాయని, మరణాలు, నష్టం అక్కడే ఎక్కువ సంభవించిందని సంస్థ ప్రతినిధి అబ్దుల్‌ ముహారి తెలిపారు. వర్షాల కారణంగా 37వేలకు పైగా ఇళ్లు, భవనాలు నీట మునిగాయి. మూడు ఇళ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని చెప్పారు.

➡️