భూమిపై నరకం గాజా !

Dec 13,2023 11:13 #earth, #Gaza, #hell
  • ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలు
  • 24గంటల్లో 207మంది మృతి
  • కమల్‌ అద్వాన్‌ అసుపత్రిపై ఇజ్రాయిల్‌ దాడి

గాజా : ఇజ్రాయిల్‌ హంతక దాడులతో గాజా ‘భూమిపై నరకం’ మాదిరిగా తయారైందని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. దక్షిణ, సెంట్రల్‌ గాజాల్లో ఇజ్రాయిల్‌ సైన్యం సాగిస్తున్న దాడుల్లో అనేకమంది మరణించారు. ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు దాడులు చేస్తున్న ఇజ్రాయిల్‌ తాజాగా కమల్‌ అద్వాన్‌ ఆసుపత్రిపై విరుచుకుపడింది. పేషెంట్ల రూమ్‌లోకి ప్రవేశించి యథేచ్ఛగా సైన్యం కాల్పులు జరిపింది. రోగులు, వైద్య సిబ్బందిని అందరినీ ఆసుపత్రి ఆవరణలో ఒక చోటకు నెట్టి వారిని తనిఖీల పేరుతో వేధించింది. కొందరిని అరెస్టు చేసింది. ఇజ్రాయిల్‌ సైన్యం దాడుల్లో ఇప్పటికే చాలా ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. దక్షిణ గాజాలో పనిచేస్తున్న ఒకే ఒక ఆసుపత్రి కమల్‌ అద్వాన్‌. ఇప్పుడు దానిని కూడా ఇజ్రాయిల్‌ సైన్యం నాశనం చేసింది. దీనిపై గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. గాజాలో ఆరోగ్య సేవలను పూర్తిగా స్తంభింపచేయాలన్నది ఇజ్రాయిల్‌ లక్ష్యంగా వుందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విమర్శించింది. ఇప్పటివరకు 22 ఆస్పత్రులు, 46 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు దాడులకు గురయ్యాయి. ఆరోగ్య సేవలు పూర్తిగా స్తంభించాయి. దీంతో గాయపడిన వారు చికిత్స కోసం విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రులను చుట్టుముట్టి ఎవరూ లోపలకు వెళ్లకుండా, బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. వైద్య సిబ్బందిపై, రోగులపై తరచుగా కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. శాంతి కోసం ఐక్యంగా నిలవాలని ఈ సమావేశంలో ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి ఆమోదానికి పెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసిన సంగతి తెలిసిందే. గాజాలో ఇజ్రాయిల్‌ రెండు మాసాలుగా జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు మొత్తంగా 18,200మంది మరణించారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

➡️