ఐసిజె లో దక్షిణాఫ్రికాకు పెరుగుతున్న మద్దతు

Jan 11,2024 09:45 #israel hamas war, #South Africa
  • ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి

ప్రిటోరియా : గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్యలను నిలుపు చేస్తూ తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని (ఐసిజె) దక్షిణాఫ్రికా కోరింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా తీసుకున్న ఈ చర్యకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బొలీవియా, మలేసియా, బంగ్లాదేశ్‌లు మద్దతుగా ప్రకటనలు జారీ చేశాయి. ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయ స్థానం గురువారం విచారణ చేపట్టనుంది. పాలస్తీనియన్లకు మద్దతుగా దక్షిణాఫ్రికా తీసుకున్న చారిత్రక చర్యను బొలీవియా ప్రభుత్వం గుర్తించిందని తెలిపింది. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న నేరాలపై దర్యాప్తు చేయాలని బొలీవియా కోరుతోంది. గాజాలో సాగుతున్న అత్యాచారాలకు ఇజ్రాయిల్‌ను జవాబుదారీని చేసే దిశగా సకాలంలో, స్పష్టమైన చర్యలు తీసుకోవాలని మలేసియా కోరింది. టర్కీ, 57 దేశాలతో కూడిన ఇస్లామిక్‌ సహకార సమాఖ్య (ఒఐసి)లు కూడా ఈ విషయంలో దక్షిణాఫ్రికాకు మద్దతు పలికాయి. ఇజ్రాయిల్‌ విచక్షణా రహితంగా పాలస్తీనియన్లపై జరిపే దాడులు, సాగించే హత్యలు, విధ్వంసం, ఇవన్నీ కూడా మారణకాండ కిందకే వస్తాయని, పాలస్తీనా జాతి నిర్మూలన చర్యలుగానే పరిగణించాలని ఓఐసి పేర్కొంది. 30ఏళ్ళ క్రితం ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన జోర్డాన్‌ కూడా ఐసిజెలో దక్షిణాఫ్రికాకు మద్దతిచ్చింది. అంతర్జాతీయ న్యాయ స్థానంలో దక్షిణాఫ్రికా పెట్టిన దరఖాస్తుకు మద్దతుగా ఈ నెల 8న 900కి పైగా ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, యూనియన్లు, ఇతర సంస్థలు, సంఘాలు ‘డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇంటర్‌వెన్షన్‌’ దాఖలు చేయాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా గల దేశాలకు పిలుపిచ్చాయి. 

➡️