హమాస్‌ కమాండర్‌ను గుర్తించాం : ఐడిఎఫ్‌

 జెరూసలెం :    హమాస్‌ కీలక కమాండర్‌ యహ్వా సిన్వర్‌ను గుర్తించినట్లు ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడిఎఫ్‌) పేర్కొంది. ఆయన దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్‌ ప్రాంతంలో ఉన్న సొరంగంలో ఉన్నట్లు ఓ వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఇది నిర్థారణైతే.. అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడికి ముందు అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత సిన్వర్‌ కనిపించడం ఇదే మొదటిసారి. హమాస్‌ దాడులకు అతనే మాస్టర్‌ మైండ్‌ అని ఐడిఎఫ్‌ ఆరోపిస్తోంది.

ఓనిమిషం నిడివి కలిగిన ఈ వీడియోలో అతని భార్య, ముగ్గురు పిల్లలు, సోదరుడు ఇబ్రహీంతో కలిసి సిన్వర్‌ సొరంగంలో నడచుకుని వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అతని చేతిలో ఓ బ్యాగ్‌ కూడా ఉంది. కృత్రిమ మేథస్సు (ఎఐ) ద్వారా అతనిని గుర్తించినట్లు ఐడిఎఫ్‌ తెలిపింది. హమాస్‌ సొరంగాల్లోని సిసిటివి నుండి ఈ  దృశ్యాలను  సేకరించినట్లు ఐడిఎఫ్‌ ప్రతినిధి డానియల్‌ హగారీ వెల్లడించారు. ఈ వీడియో అక్టోబర్‌ 10వ తేదీ నాటిదని అన్నారు. సిన్వర్‌ను పట్టుకొనే వరకు తమ వేట ఆగదని ఆయన స్పష్టం చేశారు.

➡️