ఆరని కార్చిచ్చు – పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో టెక్సాస్‌ విలవిల

టెక్సాస్‌ : వారం రోజుల క్రితం టెక్సాస్‌ అడవులను అంటుకున్న మంటలు అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తూనే ఉన్నాయి. కార్చిచ్చును అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ ఫలితం అంతగా కనిపించడం లేదు. శనివారం కార్చిచ్చు మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వేడి గాలులతో టెక్సాస్‌ ప్రజలు విలవిలలాడుతున్నారు. టెక్సాస్‌ చరిత్రలో అతిపెద్ద కార్చిచ్చుగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు. నైరుతి నుండి వీస్తున్న గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ మంటలకు ఇప్పటికే ఇద్దరు బలయ్యారు. మూగ జీవాలు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. 1,700 చదరపు మైళ్లు (4,400 చదరపు కిలోమీటర్లు) మేర అడవులు కాలి బూడిదయ్యాయి. బలమైన గాలులు, ఎండిన గడ్డి, పెరిగిన ఉష్ణోగ్రతలే కార్చిచ్చు రేగడానికి కారణమని భావిస్తున్నారు. టెక్సాస్‌ అగ్రికల్చర్‌ కమీషనర్‌ సిడ్‌ మిల్లర్‌ మాట్లాడుతూ, మంటల కారణంగా వ్యక్తిగత పచ్చిక బీడులు పూర్తిగా నాశనమయ్యాయి. పశువుల పరిశ్రమ దెబ్బతింది. ఫలితంగా గొడ్డు మాంసం ధరలు అమాంతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

➡️