తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ

Nov 28,2023 10:57 #Gaza, #israel hamas war

 అంతర్జాతీయ సమాజం నుంచి పెరుగుతున్న ఒత్తిడి

గాజా, జెరూసలెం :   గాజాలో కాల్పుల విరమణకు చివరి రోజైన సోమవారం శాశ్వత కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ఈజిప్ట్‌, ఖతార్‌, అమెరికా శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయిల్‌ను కోరుతున్నాయి. గాజాలోని ఇజ్రాయిల్‌ బలగాలనుద్దేశించి ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, ”ఏదీ మనల్ని అడ్డుకోలేదు” అని వ్యాఖ్యానించారు. ప్రతి పదిమంది బందీల విడుదలకు ఒక్కో రోజును పొడిగిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు నెతన్యాహు తెలిపారు.ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో 14,854మంది పాలస్తీనియన్లు మరణించారు. 37వేల మంది దాకా గాయపడ్డారు. మరో 6,800 మంది చనిపోవడమో, కూలిపోయిన భవన శిథిలాల కింద సమాధి కావడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాల్పుల విరమణ సుదీర్ఘకాలం అమల్లో వుంటే తప్ప గాజాలో పరిస్థితులు అదుపులోకి రావని పాలస్తీనా శరణార్ధుల కోసం పనిచేసే ఐక్యరాజ్య సమితి సంస్థ వ్యాఖ్యానించింది. శాశ్వత కాల్పుల విరమణ జరగాలని, పాలస్తీనియన్లపై యూదుల నేరాలు పూర్తిగా ఆగిపోవాలని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్‌ కానాని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధంపై చర్చించేందుకు యురోపియన్‌, అరబ్‌ దేశాల ప్రతినిధులు బార్సిలోనాలో సమావేశమయ్యారు. 42 ప్రతినిధి బృందాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

మరో 60మంది అదుపులోకి

కాల్పుల విరమణ నాల్గవ రోజైన సోమవారం విడుదలవ్వాల్సిన బందీలు, ఖైదీల జాబితాను ఇరు పక్షాలు మార్పిడి చేసుకున్నాయి. వెస్ట్‌ బ్యాంక్‌లో గత రాత్రి మరో 60మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ బలగాలు అరెస్టు చేశాయని పాలస్తీనియన్‌ ప్రిజనర్స్‌ క్లబ్‌ వెల్లడించింది. అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో మూడు వేల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ బలగాలు నిర్బంధించాయి. ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఇజ్రాయిల్‌లోని హమాస్‌ దాడి చేసిన ప్రాంతాల్లో ప్రధాని నెతన్యాహుతో కలిసి పర్యటించారు. జర్నలిస్టులపై ఊచకోతను ఆపండిపాలస్తీనా జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతను వెంటనే ఆపాలని అంతర్జాతీయ జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. అక్టోబరు 7 నుంచి అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో 63 మంది పాలస్తీనా జర్నలిస్టులు గాజా, వెస్ట్‌బ్యాంక్‌ల్లో చనిపోయారు.

➡️