ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలపై విచారణ..ఐరాస డిమాండ్‌

Dec 23,2023 10:35 #israel hamas war

న్యూయార్క్‌: గాజాలో ఇజ్రాయిల్‌ ఆర్మీ సాగించిన యుద్ధ నేరాలపై విచారణ జరిపించాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్‌ చేసింది. రమల్లాలోని వెస్ట్‌ బ్యాంక్‌ సిటీలో ఐరాస మానవ హక్కుల సంస్థ ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో తలదాచుకున్న నిరాయుధులైన పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు జరపడాన్ని ఐరాస తప్పు పట్టింది. ఈ కాల్పుల్లో 11 మంది పాలస్తీనీయులు, వారి కుటుంబ సభ్యులు చనిపోయారు. గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న హంతక దాడులను ఆపేందుకు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్న తీర్మానం భద్రతా మండలి ముందుకు ఓటింగ్‌కు వస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయిల్‌ అమానుష చర్య యుద్ధ నేరం కిందికే వస్తుందని ఐరాస మానవ హక్కుల సంస్థ పేర్కొంది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా తెచ్చే తీర్మానాన్ని గుడ్డిగా వీటో చేస్తున్న అమెరికా, ఈ యుద్ధ నేరాలపై విచారణను కూడా అడ్డుకోవాలని చూస్తోంది. గాజాలో తక్షణ మానవతావాద కాల్పులవిరమణను డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలి ఈ నెల8న తీసుకొచ్చిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత 193 మంది సభ్యుల జనరల్‌ అసెంబ్లీ డిసెంబరు12న ఇదే తీర్మానాన్ని 153-10 ఓట్ల తేడాతో ఆమోదించింది. 23 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న విచక్షణా రహిత దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు సంఘీభావంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. హమాస్‌ను నాశనం చేసేవరకు పాలస్తీనీయులపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు హూంకరిస్తున్నారు.

➡️