జర్నలిస్టుపై ఇజ్రాయెల్‌ ఆర్మీ సంచలన ప్రకటన – గాజాలో జర్నలిస్టులే లక్ష్యం..!

Feb 12,2024 10:38 #Army, #Israel, #sensational statement

జెరూసలెం : పాలస్తీనాకు చెందిన అల్‌జజీరా విలేకరి మహమ్మద్‌ వషా హమాస్‌ సీనియర్‌ కమాండర్‌గా పనిచేస్తున్నారని ఇజ్రాయెల్‌ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. గాజాలోని హమాస్‌ క్యాంపులపై తాము చేసిన దాడుల్లో ఆధారాలు దొరికాయని స్పష్టం చేసింది. మహమ్మద్‌ వషాకు చెందిన ల్యాప్‌టాప్‌లో దొరికిన చిత్రాలే ఇందుకు ఆధారాలని, హమాస్‌ యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ యూనిట్‌ హెడ్‌గా వషా పనిచేశారని తెలిపింది. దీనిపై ఐడీఎఫ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అవిచే అడ్రే మాట్లాడుతూ … హమాస్‌ క్యాంపులో దొరికిన ఒక ల్యాప్‌టాప్‌పై తమ ఇంటెలిజెన్స్‌ దర్యాప్తు చేపట్టిందన్నారు. దానిలో మహ్మద్‌ వషా కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలు దొరికాయని చెప్పారు. త్వరలో జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదుల వివరాలు ఇంకెన్ని బయటపెడతామో ఎవరికి తెలుసునని అన్నారు.

పాలస్తీనా భూభాగంలో జర్నలిజం నిజమైన నిర్మూలనకు గురైంది : సిపిజె

గాజాలో జర్నలిస్టులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఇటీవల జరిగిన సంఘర్షణల్లో మీడియా ఉద్యోగులు అత్యధికంగా మరణించారు. గత అక్టోబరు 7న హమాస్‌ సరిహద్దు దాడి, తరువాత ఇజ్రాయెల్‌ దాడి తర్వాత గాజా, ఇజ్రాయెల్‌, దక్షిణ లెబనాన్‌లలో జరిగిన సంఘర్షణ యుద్ధాల్లో దాదాపు 68 మంది జర్నలిస్టులు, ఇతర మీడియా కార్యకర్తలు మరణించారని న్యూయార్క్‌కు చెందిన సిపిజె తెలిపింది. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో మొదటి 10 వారాల్లోనే ఎక్కువ మంది జర్నలిస్టులు ఏడాది పొడవునా ఒకే దేశంలో చంపబడ్డారు అని పేర్కొంది. ఇజ్రాయెల్‌ సైన్యం జర్నలిస్టులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్న స్పష్టమైన నమూనా గురించి సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పత్రికా చిహ్నం ధరించిన కారణంగా ఓ జర్నలిస్టు చంపబడ్డారని తెలిపింది. రెండు సందర్భాల్లో, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను చంపడానికి ముందుగానే ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధికారుల నుండి బెదిరింపులు అందుకున్నట్లు సిపిజె నివేదించింది. ఇప్పటివరకు మరణించిన జర్నలిస్టులలో 61 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు లెబనీస్‌లు ఉన్నారని తెలిపింది. అంతేకాకుండా గత అక్టోబర్‌ దాడిలో హమాస్‌ చేత చంపబడిన 1,200 మందిలో నలుగురు ఇజ్రాయెలీ జర్నలిస్టులు ఉన్నారని సిపిజె వివరించింది. ”అక్కడ విలేకరులకు సురక్షితమైన ఆశ్రయం లేదు, వెళ్ళడానికి మార్గం లేదు. ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవుతున్నారు. అక్టోబర్‌ 7 నుండి, పాలస్తీనా భూభాగంలో జర్నలిజం నిజమైన నిర్మూలనకు గురైంది, ”అని పేర్కొంది.

➡️