ఇది మానవాళిపై దాడి

May 13,2024 06:56

-ఐరాస మానవ హక్కుల చీఫ్‌ వ్యాఖ్య
– మిస్టర్‌ నెతన్యాహు! బాంబింగ్‌తో హీరో కాలేవు: గుస్తావో పెట్రో
రఫా: దక్షిణ గాజా నగరమైన రఫాపై పూర్తి స్థాయి దాడికి ఇజ్రాయిల్‌ పూనుకోవడమంటే అంతర్జాతీయ చట్టాలను కాలరాయడమేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ చీఫ్‌ వోల్కర్‌ టర్క్‌ విమర్శించారు. అంతర్జాతీయ వ్యతిరేకతను ఖాతరు చేయకుండా తూర్పు రఫానుంచే గాక సెంట్రల్‌ రఫా నుంచి కూడా పాలస్తీనా పౌరులను నిర్దాక్షిణ్యంగా తరిమివేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంక్‌లు రఫాలో నివాస ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నాయి. 3లక్షల మంది దాకా నిరాశ్రయులయ్యారు. అక్టోబరు 7 నుంచి ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో గాజాలోని 23 లక్షల మందికిగాను 85 శాతం మంది సొంత గడ్డమీదే శరణార్థులుగా మారారు. అక్కడి పరిస్థితిపై రఫా ప్రాంతవాసి 24 ఏళ్ల మహ్మద్‌ అమ్మద్‌ ఎఎఫ్‌పి వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘ గత కొన్ని రోజులుగా మేము నరకం అనుభవిస్తున్నాం.’అని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేవు, ఆహారం లేదు, మందులు లేవు, ఎక్కడికైనా వెళ్లిపోదామంటే వాహనాలకు ఇంధనం లేదు. అటు ఆకలి, ఇటు బాంబులతో పిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోతున్నారు. గడచిన 24 గంటల్లో 18 మృత దేహాలు ఆసుపత్రికి చేరినట్లు రఫా ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్‌ రఫాపై దాడి చేస్తున్నందున ఆ దేశానికి ఆయుధాల ఎగుమతులను ఆపేయాలన్న డిమాండ్‌ అమెరికా, బ్రిటన్‌, ఇతర పశ్చిమ దేశాల్లో ఊపందుకుంటోంది. ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరా నిలిపేయాలని బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. రఫాపై దాడికి తాము వ్యతిరేకమే కానీ, ఆయుధాల ఎగుమతిని ఆపలేమని సునాక్‌ ప్రభుత్వం చెబుతోంది. ఆయుధాల సరఫరా ఆపడమంటే హమాస్‌కు బలం చేకూర్చడమేనని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కెమరాన్‌ అన్నారు.

➡️