ప్రధాని మోడీపై వ్యాఖ్యలను ఖండించిన మాల్దీవుల పర్యాటక పరిశ్రమ

 మాలె :    ప్రధాని మోడీపై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను మాల్దీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూరిజమ్‌ ఇండిస్టీ (ఎంఎటిఐ) తీవ్రంగా ఖండించింది. సోషల్‌ మీడియా వేదికగా డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎంఎటిఐ మాలెలో సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ”మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారత్‌ స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. మా దేశ సరిహద్దులను తిరిగి తెరిచినపుడు, కరోనా మహమ్మారి సయమంలో పర్యాటక పునరుద్ధరణకు సహాయం అందించింది. అప్పటి నుండి మాల్దీవులకు భారత్‌ అగ్ర మార్కెట్‌లలో ఒకటిగా కొనసాగుతోంది” అని పేర్కొంది. భారత్‌ను సమీప పొరుగుదేశం, మిత్రదేశాలలో ఒకటని ఆ ప్రకటనలో తెలిపింది. ”వివిధ సంక్షోభాల సమయంలో భారత్‌ మొదటగా ప్రతిస్పందించిందని, భారత ప్రభుత్వం, ప్రజలు కలిగి ఉన్న సన్నిహిత సంబంధాలకు మేము కృతజ్ఞులం. ఇకపై అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం ” అని పేర్కొంది.

మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023లో సుమారు 17 లక్షల పర్యాటకులు సందర్శించగా, వారిలో 2 లక్షలకు పైగా భారతీయులు ఉన్నట్లు తెలిపింది. 2022లో ఈ సంఖ్య 2.4 లక్షలుగా ఉండగా, 2021లో 2.11 లక్షలుగా ఉంది. మహమ్మారి సమయంలోనూ అంతర్తాతీయ పర్యాటకుల కోసం తెరిచిన కొన్ని దేశాలలో మాల్దీవులు కూడా ఒకటి. ఆ సమయంలో సుమారు 63 ,000 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు.

➡️