మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మందికి పైగా మృతి

Jan 26,2024 07:47 #Gold Mines, #mali

బాంకొ : పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని కుప్పకూలి సుమారు 70 మందికి పైగా మృతి చెందారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ దేశ గనుల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అనధికార మైనింగ్‌ కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మైనింగ్‌ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని గనుల మంత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. ఘటన సమయంలో అక్కడ 200 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు గనుల శాఖ అంచనా వేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ రెస్క్యూ సిబ్బంది 70 మృతదేహాలు వెలికితీశారు. మృతుల్లో ఎక్కువగా మైనర్లే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని గనుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

కాగా, మాలిలో ఇలాంటి విషాదాలు సర్వసాధారణమే. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తిదారుగా మాలి టాప్‌ -3 స్థానంలో ఉంది. ప్రధానంగా భద్రతా చర్యలను పాటించకుండా అక్రమ మైనింగ్‌కి పాల్పడుతుండడమే ఈ ప్రమాదాలకు కారణం.

➡️