నెతన్యాహు వైదొలగాలి : ఇజ్రాయిల్‌వ్యాప్తంగా పలు నగరాల్లో వేలాదిమంది ప్రదర్శనలు

Jan 5,2024 11:12 #demands, #Israel, #Netanyahu

టెల్‌ అవీవ్‌ : గాజాపై గత మూడు మాసాలుగా దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును తక్షణమే పదవి నుండి వైదొలగాలంటూ వేలాదిమంది ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కొత్తగా ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ఇజ్రాయిల్‌ మితవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెల్‌అవీవ్‌లోని హబీమా స్క్వేర్‌ వద్దకు వేలాదిమంది ప్రదర్శకులు గుమిగూడారు. తక్షణమే ఎన్నికలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేవలం టెల్‌ అవీవ్‌లోనే కాకుండా జెరూసలేం, హైఫా, కార్కుర్‌, కైఫర్‌ సావా, తదితర నగరాల్లో ఇదే తరహాలో ప్రదర్శనలు, ఆందోళనలు ఈ నెల 2న జరిగాయి. రాడికల్‌ బ్లాక్‌ కార్యకర్తలు, హదష్‌ (డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సాలిడారిటీ) సభ్యులు, ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వేల సంఖ్యలో యుద్ధాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేశారు. నెతన్యాహు, ఆయన ఫాసిస్ట్‌ కూటమిని లక్ష్యంగా చేసుకుని అనేకమంది బ్యానర్లు ప్రదర్శించారు. నెతన్యాహు పాలనలో పరిస్థితులు ఈ విధంగా వున్నాయని, ఒక విపత్తు తర్వాత మరొకటి తలెత్తుతునే వుందని ప్రదర్శకులు నినాదాలు చేశారు. మరింత మెరుగైన భవితవ్యం కోసం మనం ఈ సందర్భంగా తీర్మానించాలని కోరారు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ జరగాలన్నదే కొత్త సంవత్సరం తీర్మానమని వారు స్పష్టం చేశారు. అమెరికాలో కూడా న్యూయార్క్‌, బోస్టన్‌, వాషింగ్టన్‌ సహా పలు నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణ జరగాలని ప్రదర్శకులు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతమున్న దయనీయ పరిస్థితులను పరిష్కరించాలంటే ముందుగా శాశ్వత కాల్పుల విరమణ జరగాలని, అది అనివార్యమని వారు పేర్కొన్నారు.

➡️