బ్రెజిల్‌ను ముంచెత్తిన వర్షాలు, వరదలు

May 7,2024 00:22 #floods
  •  78మంది మృతి, వేలాదిమంది తరలింపు

పోర్ట్‌ అలెగర్‌: దక్షిణ బ్రెజిల్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో 78మంది మరణించారు. లక్షా 15వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు నగరాలు నీట మునిగాయి. వేలాదిమంది ప్రజలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రియో గ్రాండె రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రెలో ప్రజలు ఇళ్ళ పైకప్పుల మీద ఎక్కి కూర్చున్నారు. నదుల్లాగా మారిన వీధుల్లో చిన్న చిన్న పడవలు వేసుకుని ప్రజలు వెళుతున్నారు. ఆందోళనకరంగా పరిణమించిన వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావమే ఈ విపత్తుకు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలించకపో వడంతో 3వేల మందికి పైగా సైనికులను, అగ్నిమాపక సిబ్బందిని, ఇతర సహాయక కార్యకర్తలను రంగంలోకి దించారు. ప్రాధమిక అవసరాలు కూడా తీరని ఇబ్బందికర పరిస్థితుల్లో అనేకమంది చిక్కుకుపోయి, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మొత్తంగా 341 పట్టణాలు, గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. తాజా పరిస్థితుల్లో 105మంది గల్లంతయ్యారని పౌర రక్షణాధికారులు తెలిపారు. యుద్ధం సంభవించి అంతా తుడిచిపెట్టుకుపోయినట్లు వుందని, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టాల్సి వుందని రియో గ్రాండ్‌ గవర్నర్‌ ఎడ్వర్డ్‌ లెయిట్‌ తెలిపారు. అధ్యక్షుడు లూలా డసిల్వా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.

➡️