పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానిగా రెండోసారి షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో షెహబాజ్‌ (72)తో అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి ప్రమాణం చేయించారు. దేశం ఆర్థికంగా, భద్రతాపరంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశ పగ్గాలను ఆయన చేపట్టారు. త్రివిధ దళాల అధిపతులు, సీనియర్‌ అధికారులు, దౌత్యవేత్తలు, పౌర సమాజంలో, వ్యాపార రంగాల్లో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌, పిఎంఎల్‌-ఎన్‌ కార్యకర్తలు, సింథ్‌ ముఖ్యమంత్రి మురద్‌ అలీ షా ప్రభృతులు హాజరయ్యారు. గతంలో 2022 ఏప్రిల్‌ నుండి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా షెహబాజ్‌ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్‌ను రద్దు చేసి గత నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. గతంలో షెహబాజ్‌చే ప్రమాణం చేయించడానికి తిరస్కరించిన అల్వి ఈసారి కూడా రాకపోవచ్చని భావించారు. అందుకుభినుంగా, ఆయన ప్రమాణం చేయించారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అధికారాన్ని పంచుకునే ఒప్పందంపై పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీల మధ్య అంగీకారం కుదిరిన తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది.

➡️