కొలంబియా వర్సిటీలో కాల్పులు

May 7,2024 00:32 #Columbia, #Protest, #student
  •  కొనసాగుతున్న దమనకాండ
  •  వైఖరిలో మార్పులేదన్న బైడెన్‌
  •  వామపక్ష రాడికల్స్‌
  • అంటూ ట్రంప్‌ అవహేళన

న్యూయార్క్‌ : గాజా పట్ల అమెరికా విధానానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దమన కాండ కొనసాగుతోంది. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని హామిల్టన్‌హాలు లోపల ఓ పోలీసు తుపాకీతో కాల్పులు జరిపాడు. మరో పోలీసు మెట్లపై నుంచి ఓ విద్యార్థిని కిందకు తోసేశాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో 200 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వ విద్యాలయంలో పోలీసులు నిరసన శిబిరాలను తొలగించారు. అయితే, 24 గంటలు కూడా తిరగక మునుపే విద్యార్థులు అదే చోట 30 గుడారాలను ఏర్పాటుచేసుకున్నారు. చాలా యూనివర్సిటీల్లో పోలీసులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. న్యూయార్క్‌లోని పోర్టు హామ్‌ యూనివర్సిటీ, న్యూహాంప్‌షైర్‌లోని డార్ట్‌ మౌత్‌కామ్‌ యూనివర్సిటీ, న్యూ ఓర్లీన్స్‌లోని టూ లేన్‌ వర్సిటీల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇలినాయిస్‌లో నార్త్‌ వెస్టర్న్‌ వర్సిటీ, చికాగో విశ్వవిద్యాలయం, రోడ్‌ ఐలండ్‌లోని బ్రౌన్‌ యూనివర్సిటీ, ఇతర కొన్ని కళాశాలల యాజమాన్యాలు మాత్రం పోలీసులను పిలవకుండా నిరసనకారులతో శాంతియుత చర్చలు జరుపుతున్నాయి. కొలంబియా యూనివర్సిటీలోకి పోలీసులను పిలిపించిన యూనివర్సిటీ చాన్సలర్‌ మినోచె షఫిక్‌ చర్యను అమెరికన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ (ఎఎయుపి) ఖండించింది. దీనిని సాయుధ ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది.

బ్రిటన్‌ వర్శిటీల్లోను నిరసన శిబిరాలు
గత కొద్ది వారాలుగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల్లో సాగుతున్న విద్యార్ధుల నిరసన శిబిరాలు తాజాగా బ్రిటన్‌కు పాకాయి. గాజాకు సంఘీభావంగా ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వర్శిటీల్లో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల శిబిరాలను ఏర్పాటు చేశారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియచేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కొన్ని రోజుల పాట ఈ శిబిరాన్ని ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నట్లు విద్యార్ధులు తెఇపారు. గాజాలో మారణహోమాన్ని, వర్ణవివక్షతను తక్షణమే నిర్మూలించాలని కోరారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సంస్థలు, కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కోరారు. గాజాలో ఉన్నత విద్యా రంగాన్ని పాలస్తీనా నేతృత్వంలో పునర్నిర్మిస్తామని ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ హామీ ఇవ్వాలని కూడా వారు కోరారు.

మా వైఖరిలో మార్పులేదు: బైడెన్‌
అంతులేని సైనిక సహాయాన్ని ఇజ్రాయిల్‌ యుద్ధ తంత్రంలోకి పంప్‌ చేస్తున్న బైడెన్‌ ఈ నిరసనలకు తాను భయపడేది లేదని, ఇజ్రాయిల్‌ పట్ల తన ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. నిరసనలు ప్రభుత్వ విధానంలో ఏమైనా మార్పు తెస్తాయా అని విలేకరులు వైట్‌ హౌస్‌లో బైడెన్‌ను ప్రశ్నించినప్పుడు లేదు అని పెడసరంగా సమాధానమిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థుల నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న బైడెన్‌, శాంతి భద్రతల పేరుతో పోలీసుల దమనకాండను సమర్థించుకున్నారు. యూనివర్సిటీలో వందల వేల డాలర్లు ట్యూషన్‌ ఫీజు చెల్లించిన విద్యార్థులు ఈ నిరసనల వల్ల విద్యాహక్కును కోల్పోతున్నారని, జీవితాంతం ఆ అప్పుల బాధ వారిని వెంటాడుతుందని మెసలి కన్నీరు కార్చారు. గాజాలో ఇజ్రాయిల్‌ గత ఏడు నెలలుగా సాగిస్తున్న దురాక్రమణ పూరిత దాడుల్లో 14 వేల మంది పిల్లలు చనిపోతే ఆయనకు ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. మొత్తంగా 35 వేల మంది అమాయక పౌరులు చనిపోయారు. వీరిలో 70శాతం మంది మహిళలే. ఈ దాడుల్లో 14 లక్షల మంది దాకా శరణార్థులుగా మారారు. వీటి గురించి బైడెన్‌ ఏమీ మాట్లాడరు. పైగా 1400 కోట్ల డాలర్ల సైనిక సహాయాన్ని ఇజ్రాయిల్‌కు అందుజేయాలని ఆయన తాజాగా ఆదేశించారు.
విద్యార్థులు ప్రజాస్వామ్య యుతంగా శాంతియుత పద్ధతుల్లో తెలుపుతున్న నిరసనలపై బైడెన్‌, ట్రంప్‌ , వారి అధీనంలోని ప్రచార బాకాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కొలంబియా యూనివర్సిటీలో నిరసన తెలుపుతున్నవారిలో యూదు విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని కావాలనే మరుగుపరచి నిరసనకారులను యూదు వ్యతిరేకులుగాను, వామపక్ష రాడికల్స్‌గాను చిత్రించేందుకు కార్పొరేట్‌ మీడియా యత్నిస్తోంది. ఇజ్రాయిల్‌ చర్యను ప్రపంచంలో చాలా దేశాలు ఖండించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది ట్రంప్‌ మాత్రం ఈ నిరసనలను ‘వామపక్ష రాడికల్స్‌ విప్లవం’ అంటూ సోషల్‌ మీడియాలో చిందులేశారు. ప్రజాస్వామ్యానికి ముప్పు లెఫ్ట్‌ నుంచే కానీ, రైట్‌ నుంచి కాదని ఆయన సెలవిచ్చారు.

➡️