గాజాలో ఊచకోత ఆపండి : ‘భారీ’ నిరసన ర్యాలీ

Jun 10,2024 08:12 #gaja, #Protest, #White House
  •  వైట్‌ హౌస్‌ ఎదుట ‘భారీ’ నిరసన ర్యాలీ

వాషింగ్టన్‌: గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దారుణ మారణ కాండకు నిరసనగా, నెతన్యాహకు పెద్ద మద్దతుదారుగా ఉన్న బైడెన్‌ ప్రభుత్వ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా శనివారం అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌ హౌస్‌ ) ఎదుట వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. అమెరికా పీపుల్స్‌ రెడ్‌ లైన్‌ ఇచ్చిన పిలుపుమేరకు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ చట్టాలను, న్యాయ నియమాలను ఉల్లంఘిస్తూ పాలస్తీనీయులను ఊచకోత కోస్తుంటే బైడెన్‌ నిర్దేశించిన రెడ్‌ లైన్‌ను నెతన్యాహు దాట లేదంటూ వైట్‌ హౌస్‌ సన్నాయి నొక్కులు నొక్కడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సెంట్రల్‌ గాజాలో సుసిరాత్‌లో శిబిరంలో సజీవంగా ఉన్న నలుగురు బందీల విడుదల కోసం 250 మందికిపైగా అమాయక పాలస్తీనా పౌరులను ఇజ్రాయిల్‌ పొట్టనపెట్టుకుంది. ఈ దాడుల్లో మరో 400 మంది దాకా గాయపడ్డారు. ఇజ్రాయిల్‌ దాష్టీకం పట్ల అమెరికా, బ్రిటన్‌, చిలీతో సహా పలు దేశాల్లో నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి.
వైట్‌ హౌస్‌ ఎదుట జరిగిన ర్యాలీలో నిరసనకారులు పాలస్తీనా జెండా పట్టుకుని గాజాపై దాడులు ఆపండి. పాలస్తీనాకు విముక్తి కల్పించండి , తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయండి అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
చిలీ రాజధాని శాంటియాగోలో ఆందోళనకారులు పాలస్తీనాకు నరహంతక ఇజ్రాయిల్‌ నుండి విముక్తి కల్సించాలని కోరుతూ శనివారం ప్రదర్శన నిర్వహించారు. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను సైతం ఇజ్రాయిల్‌ బేఖాతరు చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలీలోని బోరిక్‌ ప్రభుత్వం పాలస్తీనాకు పూర్తి మద్దతు ప్రకటించింది. శాంటియాగో విశ్వవిద్యాలయం ఇజ్రాయిల్‌ టెక్నాలజీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

➡️