ఈ విజయం గాజాదే !

Mar 3,2024 10:08 #Amazing, #victory
  • బ్రిటన్‌ ఉప ఎన్నికలో విజేత జార్జి గలోవె వ్యాఖ్య
  • లేబర్‌ పార్టీకి ఎదురు దెబ్బ

లండన్‌ : గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమాన్ని గుడ్డిగా సమర్ధిస్తూ వచ్చిన బ్రిటన్‌ లేబర్‌ పార్టీకి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లేబర్‌ పార్టీ ఎంపీ సరల్‌ టోనీ లాయిడ్‌ మరణంతో ఖాళీ అయిన రొచ్డాలె నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ అభ్యర్ధి జార్జి గాలొవే సంచలనాత్మక విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన బడా వ్యాపారవేత్త డేవిడ్‌ తులీపై దాదాపు 6వేల ఓట్ల తేడాతో అవలీలగా గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో గలోవెకు 40 శాతం ఓట్లు లభించాయి. ఈ ఏడాదిలో బ్రిటన్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఎన్నిక ఫలితం లేబర్‌ పార్టీకి ఒక గట్టి హెచ్చరికగా పరిశీలకులు బావిస్తున్నారు శనివారం తెల్లవారు జామున ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే గాలొవె తన పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గుమికూడిన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ, ”గాజాలో ఇజ్రాయిల్‌ సాగించే మారణకాండను ప్రోత్సహిస్తూ మీరు పోషించిన పాత్రకు తగిన మూల్యం చెల్లించారు.” అని లేబర్‌ నేత సర్‌ కెయిర్‌ స్టార్మర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ”తరతరాలుగా లక్షలాదిమంది ప్రజల విశ్వాసాన్ని, ఆదరాభిమానాలను చూరగొన్న లేబర్‌ పార్టీ మీరు తీసుకున్న వైఖరి వల్ల ఈనాడు మొత్తంగా ఆ నమ్మకాన్ని కోల్పోతోంది..” అని అన్నారు.

పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన రెండూ పత్తా లేకుండా పోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లేబర్‌ పార్టీకి ఇది అతి పెద్ద క్షీణత అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా లేబర్‌ పార్టీకి మరింత నష్టం కలగకుండా ఉండాలంటే గాజాలో తక్షణమే, శాశ్వత కాల్పుల విరమణ అవసరాన్ని బలంగా నొక్కి చెప్పాల్సిన అవ సరముందని ఆ పార్టీలో ఒక సెక్షన్‌ బలంగా వాదిస్తోంది.

జార్జి గాలొవేను గెలిపించడం ద్వారా ప్రజలు పాలస్తీని యన్ల హక్కులకు మరోసారి తమ తిరుగులేని మద్దతు ప్రకటించినట్లైందని బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి రాబ్‌ గ్రిఫిత్‌ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయిల్‌ సాగించే ఊచకోత రాజకీయాలకు బ్రిటన్‌ సామ్రాజ్యవాదం మద్దతునివ్వడాన్ని ప్రజలు తిరస్కరించారు.” అని పేర్కొన్నారు. రొచ్డాలె ప్రజలు తమ అభిప్రాయాలను ఈ ఫలితం ద్వారా స్పష్టం చేశారని ఇండియన్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఐడబ్ల్యుఎ) వ్యాఖ్యానిం చింది. ‘అయిందేదో అయింది. ఇకనైనా సునాక్‌, స్టార్మర్‌లు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి వుంది.’ అని స్పష్టం చేసింది.

➡️