భూటాన్‌ ప్రధానిగా త్సెరింగ్‌ టోగ్బే

థింపూ : మంగళవారం జరిగిన భూటాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) విజయం సాధించింది. బుధవారం ఎన్నికల కమిషన్‌ అధికారికంగా వెలువరించిన ఫలితాల్లో మొత్తం 47 నేషనల్‌ అసెంబ్లీ సీట్లకు గానూ 30సీట్లను పిడిపి గెలుచుకోగా, భూటాన్‌ టెండరల్‌ పార్టీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. కాగా, లిబరల్‌ పిడిపి అధ్యక్షుడు త్సెరింగ్‌ టోగ్బే రెండోసారి ప్రధాని పదవిని చేపట్టనున్నారు. తొలుత 2013 నుండి 2018 వరకు ఆయన ప్రధానిగా చేశారు. 2008లో మొదటిసారిగా భూటాన్‌ పార్లమెంట్‌ ఏర్పడినపుడు టోగ్బే ప్రతిపక్ష నేతగా వున్నారు. స్థూల జాతీయాభిóవృద్ధి కన్నా స్థూల జాతీయ ఆనందానికే ప్రాధాన్యతనిస్తూ సుదీర్ఘంగా అనుసరిస్తూ వచ్చిన భూటాన్‌ విధానాన్ని ప్రశ్నించేలా ఈసారి తీవ్ర ఆర్థిక సవాళ్ళు ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించాయి. యువతలో నిరుద్యోగం రేటు 29శాతంగా వుండగా, గత ఐదేళ్ళుగా సగటున ఆర్థిక వృద్ధి రేటు 1.7శాతంగా వుంది. ప్రజల సంతోషం, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తామని టోగ్బే హామీ ఇచ్చారు. కాగా భూటాన్‌ కీలక వాణిజ్య భాగస్వామి అయిన భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీ, టోగ్బేకు అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

➡️