కాల్పుల విరమణకు తక్షణమే ఆమోదించాలి : అమెరికా ఉపాధ్యక్షురాలు

Mar 4,2024 11:34 #ceasefire, #Gaza, #US vice president

వాషింగ్టన్‌ :    గాజాలో ప్రతిపాదిత ఆరువారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తక్షణమే ఆమోదించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పిలుపునిచ్చారు. అదే సమయంలో గాజాలోకి తగిన సాయాన్ని అనుమతించకపోవడంపై ఇజ్రాయిల్‌పై మండిపడ్డారు. ఆదివారం అలబామాలోని సెల్మాలో హారిస్‌ ప్రసంగించారు. గాజాలో పెరుగుతున్న సంక్షోభం దృష్ట్యా .. కనీసం ఆరువారాల పాటు తక్షణ కాల్పుల విరమణ ఉండాలని, ప్రతిపాదనను వెంటనే ఆమోదించాలని అన్నారు. ఇజ్రాయిల్‌ కొత్త సరిహద్దు క్రాసింగ్‌ను తెరవాలని, మానవతా సాయం పంపిణీపై ఆంక్షలు విధించకూడదని అన్నారు. కమలా హారిస్‌ ఇజ్రాయిల్‌ యుద్ధ క్యాబినెట్‌లో సెంట్రల్‌ సభ్యుడైన బెన్నీ గాండ్జ్‌తో వాషింగ్టన్‌లో మార్చి 4న భేటీ కానున్నట్లు వైట్‌హౌస్‌ అధికారి ఒకరు తెలిపారు.

గాజాలో కరువు పరిస్థితులను అడ్డుకునేందుకు గాజాలో సాయాన్ని పెంచడం అత్యవసరమని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. గాజా ప్రజలకు అత్యవసరంగా మరింత ఆహారం, నీరు , ఇతర సాయం అవసరం. దీంతో హెలికాఫ్టర్‌తో సహా అందుబాటులో ఉన్న ప్రతి ఛానెల్స్‌లో సాయం అందించేందకు కృషి చేస్తున్నామని అన్నారు.

➡️