నాణ్యతపై మీన మేషాలు

May 24,2024 02:26 #on quality, #Pisces Aries

– ప్రమాణాల రూపకల్పనలో అయోమయం
-ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి పనుల్లో లోపాలు
– పంచాయితీరాజ్‌, వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఇంతే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, పథకాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న భవనాలు, ఇతర నిర్మాణాల నాణ్యత లోపభూయిష్టంగా ఉంటోందన్న వాదనలకు అధికారుల తీరు బలం చేకూర్చుతోంది. నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ విభాగం పూర్తిగా పడకేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల పరిధిలో చేపట్టే నిర్మాణాలన్నిటికీ ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, తద్వారా పారదర్శకత, నిర్మాణ పటిష్టత వంటి విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చుని ఇదివరకే అన్ని శాఖల అధిపతులు ఒక నిర్ణాయానికి వచ్చినా..అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించడంలో సంబంధిత శాఖల అధికారుల మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణాల్లో నాణ్యత ఏ స్థాయిలో ఉదంటే ‘ఎవరికి ఎరుక’ అనే సమాధానం సంబంధిత శాఖల ఉన్నతాధికారుల నుంచి వినిపిస్తుండటం విశేషం.
ప్రధానంగా నీటిపారుదల, పంచాయితీరాజ్‌, గృహనిర్మాణం, రోడ్లు భవనాల శాఖ, వైద్య ఆరోగ్యం వంటి శాఖల్లో భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతుంటాయి. వీటి కోసం ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే ఆయా పనుల్లో నాణ్యతా ప్రణామాలను గుర్తించేందుకు నిర్దిష్టమైన విధానమంటూ ఏదీ లేదు. ఏ శాఖకు ఆ శాఖ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు చేసేందుకు ప్రయత్నించడం వల్ల ఇబ్బందులస్తున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు నాణ్యతా ప్రమాణాల్లో అన్ని శాఖలకు ‘ఒకే విధానం’ తీసుకురావాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇందుకోసం ఆయా శాఖల ఇంజనీరింగ్‌ విభాగాలతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. వీటిని బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇరజనీర్స్‌ (బోస్‌) ఆమోదముద్ర కూడా వేసింది. ఆయా నిర్మాణాల్లో క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించిన అన్ని అంశాలతో సవివరమైన నివేదికను గతంలోనే ప్రభుత్వానికి కూడా అందజేసినట్లు తెలిసింది. కానీ దీనిపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకుండా సంబంధిత యంత్రాంగం నాన్చుతూ వస్తోందని కీలక శాఖకు సంబంధించిన చీఫ్‌ ఇంజనీర్‌ ఒకరు వ్యాఖ్యానించారు.
కనీసం థర్డ్‌ పార్టీ ద్వారా అయినా క్వాలిటీ కంట్రోల్‌ పర్యవేక్షించాలని ఆర్థికశాఖ నుంచి అన్ని శాఖలకు సూచనలు వెళ్లినా వాటిని కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రూ.10 లక్షల లోపు పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించినా..దానిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పర్యవేక్షించే బాధ్యతలు ప్రధానంగా నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌కు అప్పజెప్పాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

➡️