గాజాలో తాగునీటికి కటకట : యునిసెఫ్‌

Dec 21,2023 08:45 #Gaza, #Unicef, #Water Problem
unicef on water crisis in gaza

వాషింగ్టన్‌ : గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులతో ఆ ప్రాంతమంతటా మంచి నీటి ఎద్దడి, పారిశుద్ధ సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యునిసెఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యలతో చిన్నారులకు పెను ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ దాడులతో గాజా ప్రాంతంలోకి ప్రజలకు రోజుకు కేవలం 1.5 నుంచి 2 లీటర్ల వరకూ మాత్రమే అనుమతి ఇస్తున్నారని, ఇది ప్రజల మనుగడ కోసం సిఫార్సు చేసిన అవసరాల కంటే చాలా తక్కువని పేర్కొంది. సరైన తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ వ్యవస్థ లేకపోవడంతో చిన్నారులు వివిధ వ్యాధుల భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్‌ దాడుల ప్రభావానికి గురువుతున్న ప్రజల్లో సగం మంది చిన్నారులై ఉన్నారని వివిధ గణాంకాలు చెబుతున్న సంగతి తెలిసిందే. వీరికి ఆహారం, నీరు, ఆశ్రయం, మందులు అత్యవసరమని యునిసెఫ్‌ పేర్కొంది. ఇజ్రాయిల్‌ వరస దాడుల కారణంగా గాజాలో నీరు, పారిశుద్ధ్య వ్యవస్థలు అధ్వాన స్థితిలో ఉన్నాయని తెలిపింది. ప్రజలకు కేవలం మనుగడ కోసమే రోజుకు 3 లీటర్లు అవసరమని, సాన్నం, వంట, ఇతర అవసరాలను కూడా లెక్కిస్తే రోజుకు కనీసం 15 లీటర్లు అవసరమని తెలిపింది. సరైన మంచినీరు లేక గాజాలో ప్రస్తుతం ప్రజలు లవణీయుత ఎక్కువగా ఉన్న కలుషిత జలాలనే తాగుతున్నారని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సమాచారం ప్రకారమే నవంబర్‌ 29 నుంచి డిసెంబరు 10 వరకూ అతిసార కేసులు ఐదేళ్లలోపు చిన్నారుల్లో 66 శాతం, మిగిలిన వారిలో 55 శాతం పెరిగాయి. మెనింజైటిస్‌, చికెన్‌పాక్స్‌, కామెర్లు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వంటి కేసులు కూడా భారీగా పెరిగాయి.

➡️