యెమెన్‌పై బాంబు దాడికి అమెరికా సమర్థనలు దయనీయం: లావ్రోవ్‌

Jan 19,2024 11:20 #Lavrov, #Yemen

మాస్కో: యెమెన్‌పై బాంబుదాడులకు దిగిన అమెరికా, దాని మిత్రదేశాలు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించాయని రష్యా విమర్శించింది. రష్యన్‌ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ గురువారం నాడిక్కడ మాట్లాడుతూ, యెమెన్‌పై బాంబు దాడిని సమర్థించుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రకటనలు చాలా దయనీయంగా ఉన్నాయని అన్నారు. యెమెన్‌పై దాడి చేసే అధికారం అమెరికా, బ్రిటన్‌లకు ఎవరిచ్చారు అని ఆయన ప్రశ్నించారు. 2011లో లిబియాపై కూడా నాటో ఇలాగే ఏకపక్షంగా దాడి చేసి, ఆ దేశ అద్యక్షుడు కల్నల్‌ గడాఫీని చంపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా చెప్పే నిబంధనల ఆధారిత ప్రపంచ వ్యవస్థ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. యెమెన్‌పై దాడి చేయడం ద్వారా అమెరికా, దాని మిత్ర దేశాలు అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించాయన్నది స్పష్టం. దీనిని కప్పిపుచ్చుకోడానికి యెమెన్‌ హౌతీ తిరుగుబాటు దారులు వాణిజ్య నౌకలపై దాడులను కుంటి సాకుగా చూపుతున్నాయని, భద్రతా మండలిలో తీర్మానం కూడా ఇందులో భాగమేనని లావ్రోవ్‌ అన్నారు. అమెరికా, బ్రిటన్‌లకు హౌతీల కన్నా యెమెన్‌ను నాశనం చేయాలన్న దానిపైనే ఎక్కువ ఉబలాటమని ఆయన అన్నారు. యెమెన్‌పై దాడిని తాము ఖండిస్తున్నామని రష్యా విదేశాంగ మత్రి చెప్పారు. ఇదిలా వుండగా అమెరికన్‌ సెంట్రల్‌ కమాండ్‌ బుధవారం యెమెన్‌పై పెద్దయెత్తున వైమానిక దాడులు జరిపింది. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ పరిణామాలపై ఐరాస భద్రతా మండలిలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే చర్చలో లావ్రోవ్‌ స్వయంగా పాల్గొననున్నారు.

➡️