బ్రిటన్‌లో అణు కుంపటి

Jan 30,2024 11:18 #nuclear weapons, #US plans

అమెరికా యోచన

15ఏళ్లలో ఇదే మొదటిసారి

లండన్‌  :  బ్రిటన్‌లో అత్యంత శక్తివంతమైన అణుయుద్ధ శీర్షికల స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు మీడియా తెలిపింది. బ్రిటన్‌లో అమెరికా ఇటువంటి అణ్వాయుధ స్థావరాన్ని ఏర్పాటు చేయనుండడం గత పదిహేనేళ్లలో ఇదే మొదటిసారి. ఇప్పుడది మోహరిస్తున్న అణ్వాయుధాలు 1945లో హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కన్నా మూడు రెట్లు అధిక శక్తివంతమైనవి. ఈ అణ్వాయుధాలను సఫోక్‌లోని లాకెన్‌హీత్‌ ఆర్‌ఎఎఫ్‌ వద్ధ భద్రపరచనున్నట్లు పెంటగాన్‌ పత్రాలను ఉటంకిస్తూ ది టెలిగ్రాఫ్‌ పత్రిక తెలియజేసింది. ఇంతకుముందు 2008లో అమెరికా అణు క్షిపణులను బ్రిటన్‌లో మోహరించింది. ఈ ఆయుధాల ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి కాంట్రాక్టు కూడా కుదిరినట్లు ఆ పత్రాలు వెల్లడించాయి. దీనిపై బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, బ్రిటన్‌, నాటో పాలసీలో భాగంగా చాలా కాలంగా ఇటువంటి ఏర్పాటు వుందని పేర్కొంది. అయితే, తాజా అణ్వాయుధ స్థావరం ఏర్పాటును ఖండించడం కానీ, అంగీకరించడం కానీ ,చేయలేదు. నాటో దేశాలకు, రష్యాకు మధ్య ఇప్పటికే నెలకొన్న ఘర్షణలను ఇది మరింత రెచ్చగొట్టేదిగా ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహించనున్నట్లు గత వారం నాలటో ప్రకటించిన సంగతి తెలిసిందే.

➡️