ఇసిలో అనిశ్చితికి దారితీసిన పరిస్థితులపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి

Mar 11,2024 07:59 #cpm politburo, #prakatana

-సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఒకరు గత నెలలో పదవీ విరమణ చేయగా, మరో కమిషనర్‌ తన రిటైర్మెంట్‌కు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండగానే అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో భారత ఎన్నికల సంఘంలో ఒక్క చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ తప్ప మిగతా కమిషనర్లు ఎవరూ లేని పరిస్థితి నెలకొనడం పట్ల సిపిఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అనిశ్చితి ఎందుకేర్పడిందో, దానికి దారితీసిన పరిస్థితులేమిటో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని మార్క్సిస్టు పార్టీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. భారత ఎన్నికల సంఘంలో చోటు చేసుకున్న ఆకస్మిక పరిణామాలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, ఎన్నికల కమిషనర్లలో ఒక స్థానం ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరో కమిషనరు రిటైర్మెంట్‌కు ఇంకా మూడేళ్లు ఉండగానే అకస్మాత్తుగా రాజీనామా చేయడం, వెంటనే ఆ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయని, పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో ఇటువంటి గందరగోళ పరిస్థితి నెలకొనడం మంచిది కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్ల నియామక అధికారాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుందని, దీంతో ఎన్నికలు స్వేచ్ఛగా,న్యాయంగా నిర్వహించడంలో ఈ రాజ్యాంగ సంస్థ సమర్థత, దాని విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తుతున్నందున వీటిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ఈ అనిశ్చితికి దారితీసిన పరిస్థితులేమిటో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటనతో ముందుకు రావాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

➡️