ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్‌

Mar 15,2024 21:59 #arrested, #MLC Kavitha

-నాలుగు గంటల పాటు బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లో ఇడి సోదాలు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమార్తె, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుసార్లు ఆమెను విచారించిన ఇడి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగిందర్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం హైదరాబాద్‌ వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని కవిత నివాసానికి చేరుకున్న ఇడి బృందం ఆమెపాటు ఇతర కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. సుమారు మూడు గంటల పాటు ఇంటో సోదాలు నిర్వహించి పలు పత్రాలను సీజ్‌ చేసింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అడ్వకేట్‌ భరత్‌ను కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఇడి అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త తెలుసుకుని ఆమె నివాసానికి వచ్చిన సోదరుడు, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కెటిఆర్‌పై ఇడికి ఫిర్యాదు చేశారు. కవిత నివాసానికి చేరుకున్న బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు… బిజెపి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితపై ఆరోపణలు నిర్థారణ కావడంతో మనీ లాండరింగ్‌ యాక్ట్‌ 2022 సెక్షన్‌ 3, 4 ప్రకారం అరెస్ట్‌ చేసినట్లు ఆమె భర్త అనిల్‌కుమార్‌కు ఇడి అధికారులు తెలిపారు. ఏ కారణాలతో అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందో తెలియజేసేలా 14 పేజీల రిపోర్టును కవితకు ఇడి అందజేసింది. కవిత అరెస్ట్‌ నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద, శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ఒకరోజు ముందు కవితను ఇడి అరెస్ట్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బిఆర్‌ఎస్‌ పిలుపు

కవిత అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కుట్ర చేసి ఆమెను అరెస్ట్‌ చేయించాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

➡️